గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

అనుమతి లేని 6 కిడ్స్‌ ప్లేస్కూళ్లు సీజ్‌ జర్మనీ వర్సిటీలతో కేయూ ఎంఓయూ టీపీసీసీ చీఫ్‌ను కలిసిన ‘కుడా’ చైర్మన్‌ ఘన పాఠమణి బిరుదు ప్రదానం బాధ్యతలు గుర్తు చేశాం.. డీసీఈబీ సెక్రటరీగా శైలజ

న్యూస్‌రీల్‌

కమిషనరేట్‌ను వీడని అవినీతి అధికారులు..

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కిడ్స్‌ ప్లేస్కూల్స్‌ను బుధవారం అధికారులు సీజ్‌ చేశారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ ఆదేశాల మేరకు వండర్‌ కిడ్స్‌, బచ్‌పన్‌, కిడ్జి ప్లేస్కూ ల్స్‌ను మూసివేశారు. అదేవిధంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే పేరుతో నిర్వహిస్తున్న మై చోటా ప్లేస్కూల్స్‌ను కూడా సీజ్‌ చేసినట్లు హనుమకొండ ఎంఈఓ నెహ్రూ తెలిపారు. ఆయా స్కూళ్లలో నోటీసులు అంటించి, తల్లి దండ్రులకు కూడా సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేట దర్గా ప్రాంతంలో గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న హ్యాపీహ్యాపీ ప్లేస్కూ ల్‌ను సీజ్‌ చేశామని కాజీపేట ఎంఈఓ బి.మనోజ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్లేస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులను సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంఈఓ వెంట సీఆర్పీలు ప్రవీణ్‌కుమార్‌, రాంప్రసాద్‌ తదితరులు ఉన్నారు. అనుమతి లేని ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని గిరిరాజ్‌గౌడ్‌ తల్లిదండ్రులను కోరారు.

కేయూ క్యాంపస్‌: ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్‌ స్టడీ టూర్‌కు జర్మనీ వెళ్లారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్‌, రూసా కేయూ నోడల్‌ అధికారి ప్రొఫెసర్‌ ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎం.కుమార్‌ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు.

నయీంనగర్‌: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ‘కుడా’ రెండేళ్ల అడ్మినిస్ట్రేటివ్‌ రిపోర్ట్‌ను వారికి అందజేశారు. రెండేళ్ల కాలంలో వరంగల్‌ మహానగర పరిధిలో మౌలిక వసతుల కల్పన, మాస్టర్‌ ప్లాన్‌ విస్తరణ, ల్యాండ్‌ పూలింగ్‌, కాళోజీ కళాక్షేత్రం వంటి పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి తదితర అంశాలను చైర్మన్‌ వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ‘కుడా’ను ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నట్లు ఆ యన తెలిపారు. ఇనగాల వెంట ఎమ్మెల్యే నాగరాజు, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ పింగిలి వెంకట్రాంనరసింహారెడ్డి, నాయకులు ఉన్నారు.

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌కు చెందిన పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు, ప్రముఖ రుగ్వేద పండితుడు సూర్యనారాయణ ఘనాపాఠి, శివసుబ్రహ్మణ్య ఘనాపాఠి సోదరులు రుగ్వేద సుధాకర బిరుదు అందుకున్నారు. ఈ మేరకు శ్రుతి స్మృతి ట్రస్ట్‌ బాధ్యులు హైదరాబాద్‌లోని స్కందగిరి దేవాలయంలో 33 రోజులుగా రుగ్వేద ఘనపారాయణం నిర్వహించారు. ఆగమ సామ్రాట్‌ భద్రకాళి శేషు ఈ కార్యక్రమంలో పాల్గొని పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు ప్రదానం చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతీస్వామి ఘనాపాఠి సోదరులకు రుగ్వేద సుధాకర బిరుదు అందజేశారు.

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్‌ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్‌జోషి, ఏవీ రంగనాథ్‌, అంబర్‌కిషోర్‌ ఝా, సన్‌ప్రీత్‌సింగ్‌ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్‌ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి.

పార్కింగ్‌ సమస్య..

నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు పార్కింగ్‌ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్‌ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్‌ చేసి షాపింగ్‌ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్‌ స్థలాలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, వరంగల్‌ పోలీస్‌ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్‌ పెరగడం వల్ల మరో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఏఆర్‌లో ఎక్కడి వారు అక్కడే..

పోలీస్‌ శాఖలో లా అండ్‌ అర్డర్‌తో పాటు ఏఆర్‌ విభాగం చాలా కీలకం. ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్‌ఎస్సై, ఆర్‌ఐ, ఏసీపీ, అడిషనల్‌ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్‌ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్‌ వ్యాపారం, సెటిల్‌మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి.

నేతల అండ.. నిబంధనలు తూచ్‌

వరంగల్‌, హనుకొండ, కాజీపేట సబ్‌ డివిజన్‌లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్‌ స్టేషన్లను వారి ప్రైవేట్‌ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్‌మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్‌ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు.

దృష్టి సారిస్తే...

మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్‌ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్‌ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు. ఏది ఏమైనా నూతన సీపీ ఆల్‌ ది బెస్ట్‌.

వరంగల్‌ సబ్‌ డివిజన్‌లో కరువైన లా అండ్‌ ఆర్డర్‌..

పేదల కోసం

భూ పోరాటం ఉధృతం

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

హన్మకొండ అర్బన్‌: పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు సాధించే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం భారీ పికెటింగ్‌ నిర్వహించారు. ఉదయం నుంచే కలెక్టరేట్‌కు చేరుకున్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు అధికారులను, సిబ్బందిని లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పికెటింగ్‌ కొనసాగుతుండగా సుబేదారి పోలీసులు వామపక్ష నాయకులను అరెస్ట్‌ చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, వామపక్ష శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం త క్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులను సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కా ర్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, జి.ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌.హంసారెడ్డి, నేదునూరి జ్యోతి, ఆదరి శ్రీనివాస్‌, మండ సదాలక్ష్మి, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

సీకేఎం కళాశాల

ప్రిన్సిపాల్‌గా పోచయ్య

కాశిబుగ్గ : వరంగల్‌ దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా (ఎఫ్‌ఏసీ) ఆచార్య జి.పోచయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. వర్ధన్నపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న పోచయ్యను సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ కళాశాల ఉన్నత విద్యా కమిషనర్‌ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం పదవీ విరమణ పొందిన ప్రిన్సిపాల్‌, డా క్టర్‌ ధర్మారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న ప్రిన్సిపాల్‌ పోచయ్యను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

బల్దియా అడిషనల్‌ కమిషనర్‌ ఇసంపల్లి జోనా

వరంగల్‌ అర్బన్‌: బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇన్‌వార్డులో ఇద్దరు మహిళా ఉద్యోగుల మధ్య మనస్పర్థలు తలెత్తడం, విధుల్లో బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో వారికి విధులను గుర్తు చేసినట్లు అడిషనల్‌ కమిషనర్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఇసంపల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌వార్డులో నమోదైన దరఖాస్తులు ఆయా విభాగాలకు పంపించడంలో జాప్యం అవుతోందని ఇన్‌వార్డు ఉద్యోగులు చందన, శ్రుతిని తన చాంబర్‌కు పిలిపించి దరఖాస్తులను త్వరితగతిన చేరవేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఇబ్బందులతోనే శ్రుతి తన స్వగృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. వాస్తవాలను పక్కన పెట్టిన బల్దియా ఉద్యోగులు, అధికారులపై నింద మోపడం సరికాదన్నారు. ఈ ఘటనలో సీ–1 సూపరింటెండెంట్‌, ఇతర ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) సెక్రటరీగా జిల్లా కేంద్రంలోని టీపీటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయురాలు ఆదిరాజు శైలజ నియమితులయ్యారు. ఈమేరకు డీఈఓ, డీసీఈబీ చైర్మన్‌ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్‌ బి.రాంధన్‌ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నియమించిన శైలజ బుధవారం సాయంత్రం డీఈఓ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

ఏఆర్‌లో పాతుకుపోయిన అధికారులు

నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్‌

వరంగల్‌ సబ్‌ డివిజన్‌లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్‌ డివిజన్‌లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్‌మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

సీసీఎస్‌లో కదలరు.. వదలరు

దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్‌ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్‌ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్‌ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్‌ తయారైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్‌ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్‌ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్‌ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్‌లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement