హన్మకొండ: వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలు కురవకపోవడం, పెరిగిన జల వినియోగంతో హనుమకొండ జిల్లాలో జలమట్టం తగ్గుతూ వస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సమృద్ధిగా ఒక్క వర్షం కూడా కురవలేదు. కనీస సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడంతో వానాకాలం సాగు ఇప్పటికీ చాలా చోట్ల ప్రారంభం కాలేదు. వర్షాలు లేక సాగు అవసరాల కోసం రైతులు భూగర్భజలాలు తోడుతున్నారు. గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు కొద్దిగా పైనే ఉన్నప్పటికీ... గత మే నెలతో పోలిస్తే పడిపోయాయి. హనుమకొండ జిల్లాలో సగటున మే నెలాఖరులో 6.17 మీటర్ల లోతులో ఉన్నాయి.
పాతాళానికి జలాలు..
జిల్లాలో ఈ ఏడాది 69 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని ప్రభావం భూగర్భజలాలపై పడుతోంది. ఫలితంగా ప్రతీ నెల భూగర్భజలాలు పడిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. భూగర్భ జల శాఖ జిల్లాలోని 25 ప్రాంతాల్లో బోర్లు తవ్వించి ఫీజో మీటర్లు అమర్చి వాటి ద్వారా భూగర్భ జల మట్టం కొలతలను సేకరిస్తోంది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని సేకరిస్తోంది. జిల్లాలోని వేలేరు మండలం పీచర్లలో అత్యధికంగా 16.3 మీటర్ల లోతున భగర్భజలాలు పడిపోయాయి. భీమదేవరపల్లి వంగరలో 13.30 మీటర్లు, కొత్తపల్లిలో 11.20, జగన్నాథపూర్‌లో 10.90, నడికూడ మండలం చర్లపల్లిలో 12.65 మీటర్ల లోతు, హసన్‌పర్తి నాగారంలో 9.15 మీటర్లు, భూగర్భజలాలు పడిపోయాయి.
పడిపోతున్న భూగర్భ జలాలు
జిల్లాలో కానరాని వాన
రైతన్నల ఎదురుచూపులు


