ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలి

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలి

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

ఐనవోలు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని పంథిని గ్రామాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా పంథిని ప్రభుత్వ పాఠశాలలను, అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించారు. డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక, నర్సరీ, గ్రామ పంచాయతీ కార్యాలయం, పల్లె దవాఖానాను సందర్శించారు. ప్రాథమిక పాఠశాల 5, 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ సెంటర్‌లో అందుతున్న సేవలు తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. నర్సరీని సందర్శించి మొక్కల పెంపకంపై ఆరా తీశారు. పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్‌ఐఆర్‌ గురించి బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. పల్లె దవాఖానాలో అందుతున్న సేవలు పరిశీలించారు. అనంతరం చింతకుంటలోని అంగన్‌వాడీ సెంటర్‌, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండగా వారితో మాట్లాడారు. రెండు రోజుల నుంచి మాత్రమే వారు పాఠశాలకు వస్తున్నారని గుర్తించి అధికారులను ప్రశ్నించారు. విద్యార్థుల నమోదు లేకపోతే ప్రాథమిక పాఠశాల గుర్తింపు రద్దవుతుందన్నారు. ఈక్రమంలో చింతకుంటలో ఓ రైతు భూములు పట్టాలు కావడం లేదని పిర్యాదు చేయగా.. కారణం ఏంటని తహసీల్దార్‌ను అడిగారు. ఐనవోలు మండలంలో చాలా చోట్ల సమస్యలు ఉన్నాయని వాటిని క్రమక్రమంగా ఆర్డీఓ సహకారంతో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సర్పంచ్‌ శ్రీరాం భూపాల్‌రావు, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, డీపీఓ రమాకాంత్‌, డీఎల్పీఓ గంగా భవాని, తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌, ఎంపీడీఓ నర్మద, ఎంఈఓ పులి ఆనందం, ఎంపీఓ రఘుపతిరెడ్డి, ఏపీఓ నక్క కుమారస్వామి, సెక్రటరీ మాలతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement