దివ్యాంగుల అభివృద్ధికి అడుగులు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల అభివృద్ధికి అడుగులు

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

ఖానాపురం: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ప్రభుత్వం భవనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న భవనాలను ఆధునికీకరించడంతోపాటు పలు నూతన భవనాల మంజూరుకు నిధులు మంజూరు చేసింది. భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా అధికారులు సమయాత్తం అవుతున్నారు. దీంతో దివ్యాంగ పిల్లల అభివృద్ధికి తోడ్పాటు అందనుంది.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 13మండలాల్లోని దివ్యాంగుల కోసం 2013 సంవత్సరంలో నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట, వరంగల్‌ ప్రాంతాల్లో భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులను భవిత కేంద్రాలకు తీసుకొచ్చి ప్రత్యేకంగా శిక్షణ, చదువులు నేర్పించేవారు. కానీ ప్రభుత్వం ఇటీవల కాలంలో మండలానికి రెండు చొప్పున భవిత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో మండలానికి రెండు చొప్పున భవిత కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.9.50లక్షలతో నిర్మాణాలు చేయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నూతనంగా ఖానాపురం మండలంలో 2, చెన్నారావుపేటలో 1, సంగెంలో 1, దుగ్గొండిలో 2, నల్లబెల్లిలో 1, గీసుగొండలో 1, రాయపర్తిలో 1, ఖిలావరంగల్‌లో 1 చొప్పున భవనాలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు నాలుగు భవిత కేంద్రాల నిర్మాణాలు పూర్తియ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. పలు మండలాల్లో పాఠశాలల ఆవరణలో ఉన్న వాటినే ఆధునికీకరిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల్లో పలు చిత్రాలను సైతం చిత్రించారు. భవనాలతోపాటు దివ్యాంగుల కోసం మూత్రశాలలు నిర్మిస్తున్నారు.

ఐఈఆర్పీల ద్వారా అభివృద్ధి

దివ్యాంగ విద్యార్థులను ఐఈఆర్పీలు భవిత కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. భవిత కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రైమరీ విద్యాభ్యాసం చేస్తారు. దివ్యాంగుల్లో మార్పు కోసం ఫిజికల్‌ డెవలప్‌మెంట్‌, శారీరక స్కిల్‌, డ్రెస్సింగ్‌ స్కిల్స్‌, వినికిడి శిక్షణ, దృష్టి అభివృద్ధి, బ్రెయిన్‌ శిక్షణ, ఓరియంటేషన్‌, మొబిలిటీ శిక్షణ, పాఠశాల సిద్దత, జీవన నైపుణ్యాలు, ఆటలు, యోగా, సంగీతం, కళా కార్యకళాఫాలు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌, స్పీచ్‌థెరపీలు నేర్పిస్తారు. సాధారణ పిల్లల్లా మారడానికి కేంద్రంలో ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. కొంత సమయం కేటాయించి భవిత కేంద్రంలో పాఠాలు బోధిస్తారు. ఫిజియోథెరపీ అవసరమయ్యే వారి కోసం భవిత కేంద్రాలకే ఫిజియోథెరపిస్ట్‌లను తీసుకొస్తారు. సదరం సర్టిఫికెట్‌లు లేని వారి కోసం స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సదరం క్యాంపులకు తరలించి అర్హులకు సర్టిఫికెట్లు ఇప్పిస్తారు.

జిల్లాలో భవిత కేంద్రాల ఏర్పాటు

ప్రత్యేక భవనాల నిర్మాణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement