ఖానాపురం: అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం మండలంలోని అశోక్‌నగర్ భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి భవనంలోని మూత్రశాలలు, డోర్‌లను పరిశీలించి దివ్యాంగులతో మాట్లాడారు. అనంతరం పక్కనే ఉన్న ప్రాథమిక, హైస్కూల్‌లోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనంలో నాణ్యత లేకపోవడం, తక్కువగా వంట చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి కూరలు సరిగా లేకపోవడంతో నిర్వాహకులను మందలించారు. భోజనంలో రాళ్లు వస్తున్న విషయాన్ని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బియ్యాన్ని పరిశీలించగా దొడ్డు, సన్న రకాల కలయిక ఉన్నట్లు గుర్తించి సివిల్‌సప్లయీస్ అధికారులకు తెలిపి విచారణ చేపట్టాలన్నారు. పక్కనే అంగన్‌వాడీ కేంద్రం మూడు నెలలుగా తెరవడంలేదని తెలుసుకుని డీడబ్ల్యూఓకు వీడియో కాల్ చేసి చూపించారు. అంగన్‌వాడీ టీచర్ పదవీ విరమణ పొందితే సెంటర్ ఎలా మూసివేస్తారని ఆగ్రహించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు. హైస్కూల్‌లో ఎంఓఎంబీ నిధుల గోల్‌మాల్‌పై పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో డీఈఓను విచారణకు ఆదేశించారు. మనుబోతులగడ్డలో భవిత కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. బేంచీలు లేవని తెలపడంతో కేజీబీవీలో వృథాగా ఉన్న బేంచీలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని మహిళలు బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా.. పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీఈఓ రంగయ్యనాయుడు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ నంగునూరి రమేష్, ఎంఈఓ చరణ్‌సింగ్, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వాగ్య, హెచ్‌ఎం నర్సింహులు, సొసైటీ డైరెక్టర్ ఆబోతు అశోక్ ఉన్నారు.
కలెక్టర్ సత్యశారద
అశోక్‌నగర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై ఆగ్రహం
అంగన్‌వాడీ మూసివేతపై అసహనం
‘సర్’ను వేగవంతం చేయాలి..
జిల్లాలో ‘సర్’ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మనుబోతులగడ్డలో ‘సర్’ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో 795 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 7.9లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పది మందికో బీఎల్‌ఓ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని, ఇందులో నర్సంపేట 85 శాతంతో మొదటి స్థానంలో.. వరంగల్ తూర్పు 65 శాతంతో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు, బీఎల్‌ఓలు ఐడెంటీ కార్డులతో తప్పకుండా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు.


