పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలు చేయాలి

Jul 2 2026 7:01 AM | Updated on Jul 2 2026 7:01 AM

జిల్లా పంచాయతీ అధికారి కల్పన

గీసుకొండ : నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని గ్రామాల్లో కచ్ఛితంగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన హెచ్చరించారు. బుధవారం ఆమె డివిజనల్‌ పంచాయతీ అధికారి వేదవతితో కలిసి మండలంలోని కొనాయమాకుల, విశ్వనాథపురం, కొమ్మాల గ్రామ పంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, వ్యాపార నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో కల్పన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధికి, ప్రగతికి నిబంధనల అమలు ఎంతో కీలకమన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు.

ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుంటే షాపులు సీజ్‌

గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వాణిజ్య, వ్యాపార లావాదేవీలు నిర్వహించినా తప్పనిసరిగా ట్రేడ్‌ లైసెన్స్‌ (వ్యాపార అనుమతి పత్రం) కలిగి ఉండాలని డీపీఓ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు, దుకాణాలు, కమర్షియల్‌ లావాదేవీలు నిర్వహించే వారంతా గ్రామ పంచాయతీల నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ పొందాలని ఆదేశించారు. లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తే పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం దుకాణాలను సీజ్‌ చేయడంతోపాటు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పురోగతి, ఆదాయవృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, శాసీ్త్రయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణకు ప్రజల్లో చైతన్యం తేవాలని డీపీఓ పిలుపునిచ్చారు. గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన వ్యర్థాలు, ఈ–వ్యర్థాలను వేరుచేయడం కోసం నిర్ధేశించిన నాలుగు రకాల చెత్త బుట్టల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థల నుంచి చెత్తను విడివిడిగా సేకరించేలా పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించి, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని డీపీఓ హెచ్చరించారు. కార్యక్రమంలో గీసుకొండ ఇన్‌చార్జ్‌ ఎంపీఓ శేషాంజన్‌ స్వామి, కొనాయమాకుల, కొమ్మాల సర్పంచులు వజ్ర రాజు, కన్నెబోయిన యమున ప్రవీణ్‌, పంచాయతీ కార్యదర్శులు రామారావు, శ్రీధర్‌, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement