● కలెక్టర్ సత్యశారద
● ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాల తనిఖీ
● విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరికి షోకాజ్ నోటీసులు
కాశిబుగ్గ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించి, ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే విధంగా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి తనిఖీ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ వైద్యుడికి, ఏఎన్‌ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్‌కే ధర్మరాజు, అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అనసూర్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే లేబర్‌కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు అంకితభావంతో విద్యాబోధన చేయాలని సూచించారు.
మిషన్ ఎయిడ్స్ సురక్షను
విజయవంతం చేయాలి
న్యూశాయంపేట: జాతీయ స్థాయిలో లక్ష్య సాధన దిశగా మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న మూడు నెలల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి 95 శాతం లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న ప్రతీ రోగి క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నోడల్ అధికారి సమ్రేస్, రాష్ట్ర బేసిక్ సర్వీసెస్ జేడీ డాక్టర్ జయలక్ష్మి, టార్గెటెడ్ ఇంటర్ వెన్స్‌న్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్, రాష్ట్ర సమన్వయ కర్త కామేశ్వర్‌రావు, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ అరుణ్‌కుమార్ జోషి, స్వప్న మాధురి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


