కేయూ క్యాంపస్: పీహెచ్‌డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలని పరిశోధక విద్యార్థులు మంగళవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెన్యువల్ ఫీజు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు అందడం లేదని, రెన్యువల్ ఫీజు తగ్గించి, ఫీజు చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు. విద్యార్థులు కలకోట్ల సుమన్, డి.తిరుపతి, బొస్క నాగరాజు, మహబూబ్‌పాషా, మంద శ్యాం, చందు, గణపాక సురేశ్, గుగులోత్ శ్రీనివాస్ ఉన్నారు.
న్యూశాయంపేట: హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ శాఖ అధికారిగా జి.ముకుందారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ డీఎఫ్‌ఓగా విధులు నిర్వహించిన లావణ్యను మహబూబాబాద్‌కు బదిలీ చేశారు. హనుమకొండ జిల్లా డీఎఫ్‌ఓగా ముకుందారెడ్డి గురువారం బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది.
నయీంనగర్ : రోడ్లు, భవనాల శాఖ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పి.సురేష్‌బాబు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకొని రోడ్లు, భవనాల శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనలు పరిశీలించి పరిష్కరిస్తామని ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 13 ఫోన్ కాల్స్ స్వీకరించారు. ప్రయాణికుల సమస్యలు నమోదు చేసుకున్నారు.
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సందర్శించారు. మంగళవారం సూపరింటెండెంట్ చాంబర్‌లో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఆయన వెంటన ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
హన్మకొండ అర్బన్: నిర్మాణ వ్యర్థాలు విలువైన వనరులని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆస్కీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై శిక్షణలో ఆయన మాట్లాడారు. నిర్మాణ వ్యర్థాలను చెరువులు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో వేస్తే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వాటిని సేకరించి, వేరు చేసి, తిరిగి ఉపయోగిస్తే సహజ వనరుల పరిరక్షణతోపాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఇటుకలు, కాంక్రీట్, రాళ్ల వంటి వ్యర్థాలతో రహదారులు, పేవర్ బ్లాకులు, ఇతర నిర్మాణ సామగ్రిని తయారు చేయవచ్చని వివరించారు. హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


