ఎల్కతుర్తి: మామునూరు ఎయిర్‌పోర్టు ప్రక్రియను వేగవంతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ స్పష్టం చేశారు. సూరారంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. వరంగల్ అభివృద్ధి, కేంద్రం నిధులు, ఎయిర్‌పోర్టు, ఎరువుల సరఫరా తదితర అంశాలపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు మంత్రి ఘాటుగా స్పందించారు. కొత్తగా జాతీయ అధ్యక్షుడు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాలో బీజేపీతో పాటు బీఆర్‌ఎస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని తెలిపారు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో రూ.ఐదు వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. స్మార్ట్‌సిటీ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్‌లో మెజారిటీ లేకుండా మేయర్ అవుతామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలవకుండా చైర్మన్, మేయర్ ఎలా అవుతారో చెప్పాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.10 వెళ్తే తిరిగి కేవలం రూ.3 మాత్రమే వస్తున్నాయని విమర్శించారు. వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు జాతీయ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. పార్టీ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, నాయకులు బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, గూటం జోగిరెడ్డి, రావుల రమేశ్, బచ్చు బాబురావు, పుల్లూరి శ్రీధర్‌రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టు ప్రక్రియను వేగవంతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్


