● జిల్లా ఉద్యానశాఖ అధికారి కమలాకర్‌రెడ్డి
ఎల్కతుర్తి : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉందని రైతులు భవిష్యత్ దృష్ట్యా ఆయిల్‌పామ్ పంటను సాగుచేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్, జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎడవెల్లి రవీందర్‌రెడ్డి ఎనిమిది ఎకరాల భూమిలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ పంట సాగు వల్ల మంచి ఆదాయంతో పాటు కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. రైతు భరోసాకు ఈనెల 5వ తేదీలోపు దరఖాస్తు పత్రాలను వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలన్నారు. ఆయిల్ పామ్ పంట చాలా లాభదాయకంగా ఉంటుందని ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకుంటే వీలైనంత తొందరలో మొక్కలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారి శంకర్, ఉద్యాన శాఖ మండల అధికారి సుస్మిత, వ్యవసాయ శాఖ అధికారి రాజ్‌కుమార్, ఏఈఓ రోజా, రైతులు పాల్గొన్నారు.


