కమలాపూర్: తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని, తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది ఓ మహిళ. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన శ్రీజకు గుండేడుకు చెందిన డెంగు రాజుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నంగా రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పైళ్లెన మూడు నెలల నుంచి భర్త, అత్త తీవ్ర వేధింపులకు గురి చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధించారని, ఆ తర్వాత పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరుగగా తనదే తప్పు అని ఒప్పుకుని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడని తెలిపింది. అక్కడ మద్యం సేవించి వచ్చి తనను కొట్టేవాడని ఆరోపించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చేవాడని, ఆన్‌లైన్‌లో పేకాట ఆడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని వచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తూ పుస్తెల తాడుతో ఉరి బిగించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన మేన మరదలుతో ఉంటున్నాడని, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని తనను ఇంట్లోంచి తరిమేశాడని కంట తడి పెట్టుకుంది. సుమారు 20 నెలలుగా తాను పుట్టింట్లోనే ఉంటున్నానని, పోలీసుల వద్దకు పిలిపించినా తనకేమీ ఇవ్వనన్నాడని ఆరోపించింది. ఇచ్చిన కట్నం మొత్తం తమకు ఇచ్చి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది.


