సాక్షి, వరంగల్: ఒక కుటుంబం రోజుకు రెండు నిమిషాలు కేటాయించి చెత్తను విడదీస్తే.. నగరం మొత్తం పరిశుభ్రంగా మారుతుంది. ’చెత్త’గా కనిపించేది నిజానికి ఒక విలువైన వనరు. దాన్ని కలిపేస్తే సమస్య, విడదీస్తే సంపద. అందుకే పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ఇప్పటికే మునిసిపాలిటీ, కార్పొరేషన్లలో అమలు చేస్తున్న తడి, పొడిచెత్త డబ్బాలతో పాటు గృహ, ప్రమాదకర వ్యర్థాల డబ్బాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకనుంచి పచ్చ, నీలి, ఎరుపు, నలుపు నాలుగు డబ్బాల్లో ఇంటి యజమానుల నుంచే వేర్వేరుగా చెత్త సేకరణ జరపాలని ఆదేశిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడా అమలుచేసేందుకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభల్లో అధికారులు చెత్త డబ్బాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా చెత్తను తడి, పొడి, ప్లాస్టిక్, ప్రమాదకర వ్యర్థాలుగా విడదీసి సంపదగా మార్చనున్నారు. ఇది సేంద్రియ ఎరువు, రీసైక్లింగ్ ముడిసరుకు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడనుంది.
గ్రేటర్ వరంగల్‌లోనే ఎక్కువ చెత్త..
జిల్లాలోని నర్సంపేటలోని 30 డివిజన్లలో రోజువారీగా 18 టన్నులు, వర్ధన్నపేటలోని 12 విడిజన్లలో ఐదు మెట్రిక్ టన్నులు, పరకాలలోని 22 డివిజన్లలో 10 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో మాత్రం 480 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే మొత్తంగా 513 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఒక్క గ్రేటర్ వరంగల్‌లోనే అత్యధికంగా 480 టన్నులు ఉండడం ఇక్కడా తీవ్రతను తెలుపుతోంది. అందుకే ఇక్కడ నాలుగు డబ్బాల విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రతీ కుటుంబం చెత్తను ఇంట్లోనే విడదీసి ఇవ్వడంపై అవగాహన కల్పించడం, నగరవాసులు కూడా క్రమంతప్పకుండా వేర్వేరు చేసి ఇవ్వడంతోనే విజయవంతమవుతుంది.
ఇలా చేస్తే లాభం ఏంటంటే..
డంపింగ్‌యార్డులకు వెళ్లే చెత్త పరిమాణం తగ్గుతుంది.
తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేయొచ్చు.
ప్లాస్టిక్, కాగితం వంటి పొడిచెత్తను రీసైక్లింగ్‌కు పంపొచ్చు.
దుర్వాసన, ఈగలు, దోమల సమస్య తగ్గుతుంది.
కాలనీలు పరిశుభ్రంగా
ఉంటాయి.
పర్యావరణ కాలుష్యం
తగ్గుతుంది.
ఇక మరింత మెరుగ్గా చెత్త సేకరణ
చర్యలు
2 బిన్ల స్థానంలో 4 బిన్ల విధానం
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్,
మున్సిపాలిటీల్లో కొత్త విధానం
కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా
అమలుకు కసరత్తు
పర్యావరణ పరిరక్షణలో ప్రతీ కుటుంబం భాగస్వామ్యం కావాలి
కూరగాయల తొక్కల నుంచి కంపోస్ట్, ప్లాస్టిక్ నుంచి రీసైక్లింగ్, కాగితం నుంచి కొత్త ఉత్పత్తులు తయారవుతాయి. కానీ ఇవన్నీ ఒకే డబ్బాలో కలిపేస్తే ’చెత్త’గానే మిగిలిపోతాయి. ఇంటి వద్దే చెత్తను నాలుగు రకాలుగా విడదీసి అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతీ కుటుంబం భాగస్వామ్యం కావచ్చు. ఇప్పటికే ఉన్న రెండు డబ్బాల విధానం స్థానంలో నాలుగు డబ్బాల విధానం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా అమలు చేస్తాం.
–టి.వెంకన్న, కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్


