న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సనా సెక్యూరిటీ ఏజెన్సీ బాధ్యుడు సాహెబ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ (బీ1) జక్కలొద్ది బాలుర గురుకులంలో డిప్యూటీ వార్డెన్ (మేల్–1), జువాలజీ జూనియర్ లెక్చరర్ (జనరల్–1), కేయూ క్రాస్ రోడ్డులోని వరంగల్ (బాలికలు–1) గురుకులంలో జూనియర్ లెక్చరర్ బాటనీ (ఫిమేల్–1) పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 4వ తేదీలోపు హనుమకొండ పాత ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఉన్న సనా సెక్యూరిటీ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 0870 – 3558539, 81060 78890 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఎంజీఎంలో పేషెంట్ కేర్ సిబ్బంది వసూళ్లు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పేషెంట్ కేర్‌గా పనిచేస్తున్న సిబ్బంది రోగుల, వారి సహాయకుల నుంచి డబ్బులు వసూలు చేయడం సాధారణంగా మారింది. వైద్యం కోసం వచ్చిన వారికి సహాయం చేస్తున్నామని చెబుతూ బాహటంగానే డబ్బులు తీసుకోవడం పరిపాటిగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద రోగుల నుంచి అందినకాడికి దండుకోవడం నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. రేడియాలజీ విభాగంలోని ఎక్స్‌రే విభాగం వద్ద ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నా పట్టించునేవారు కరవయ్యారు. అధికారుల నియంత్రణ లేకపోవడం, సంబంధిత కాంట్రాక్టర్ అజమాయిషీ లేకపోవడం వల్ల పేషెంట్ కేర్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఉన్నత వైద్యాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.
టీఎన్జీఓ సంఘం జిల్లా కార్యవర్గ నియామకం
ఖిలా వరంగల్: టీఎన్జీఓ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా గాదె వేణుగోపాల్, కార్యదర్శిగా పాలకుర్తి సదానందం, కోశాధికారిగా కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. టీఎన్జీఓ భవనంలో జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్‌కిషన్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కేంద్ర సంఘం సహ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించారు. కార్యక్రమలో సిటీ అధ్యక్షుడు శంకేసి రాజేష్, కార్యవర్గ సభ్యులు వంశీధర్ బాబు, జి.రాజు, రమాదేవి, ఇంద్రాసేన రెడ్డి, రజినీకాంత్, శరత్, రామకృష్ణ, గణేష్, యూసూఫ్, జ్యోతి, సునీత, పద్మ, కవిత, నాయర్ పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ సర్వే పరిశీలన
మామునూరు: ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని లక్ష్మీపురం, రంగశాయిపేట, రాంగోపాలపురంలో కొనసాగుతున్న స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (సర్) సర్వేను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సోమవారం పరిశీలించారు. మార్గదర్శకాల మేరకు ప్రతీ ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యూరేషన్ ఫారాలు అందజేసి కచ్చితమైన వివరాలు నమోదు చేయాలని బీఎల్‌ఓలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు.
అవకతవకలకు తావివ్వొద్దు
కాళోజీ సెంటర్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ కోరారు. ఈ మేరకు డీఈఓ రంగయ్య నాయుడికి సంఘం ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాదరావుతో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన సర్దుబాటుపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఈసారి అలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సదానందం, కార్యదర్శి
వేణుగోపాల్, అధ్యక్షుడు


