● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● గ్రీవెన్స్‌కు 249 ఫిర్యాదులు
న్యూశాయంపేట: ప్రజల అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఫిర్యాదుదారుల అర్జీలను కలెక్టర్ స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ వేదికగా వినతుల స్వీకరణ కార్యక్రమం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగింది. ప్రజావాణికి 249 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. అందులో రెవెన్యూకు సంబంధించినవి 82, మున్సిపల్ శాఖ 65, హౌసింగ్ 31, డీఆర్‌డీఓ 5, ఇతర శాఖలకు సంబంధించినవి 66 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. అలాగే, వరంగల్ రెవెన్యూ డివిజన్‌లో 7, నర్సంపేట రెవెన్యూ డివిజన్‌లో 17 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భూమి పట్టా చేయించుకుని
బెదిరిస్తున్నాడు
వర్ధన్నపేట మండలం పీరంగడ్డలో మాకు ఒక ఎకరం 30 గుంటల భూమి ఉంది. వృద్ధులైన మాకు తెలియకుండా మా పెద్ద కుమారుడు దౌర్జన్యంగా పట్టా చేయించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. తహసీల్దారుకు కూడా ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలి.
– బి.లచ్చమ్మ, సారయ్య దంపతులు, పీరంగడ్డ
భూమి పట్టా చేయండి
నాకు ఇద్దరు కుమారులు. మాకున్న 15 గుంటల భూమిని చిన్న కుమారుడు చనిపోయాక నాకు, నా పెద్ద కుమారుడికి తెలియకుండా నా చిన్న కోడలు అక్రమంగా ఆమె పేరుమీద పట్టా చేయించుకుంది. దాంతో మాకు జీవనోపాధి లేకుండా పోయింది. పంచాయితీ పెట్టితే మా మీదనే నిందారోపణలు చేసింది. తిరిగి ఆ భూమిని నాపేరు మీద పట్టా చేయండి. – పి.పూలమ్మ, నర్సక్కపేట, నల్లబెల్లి


