కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్‌సైట్, సర్వర్ మొరాయించడంతో భూక్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. ఐదేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వెబ్‌సైట్‌తో పాటు సర్వర్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపేశారు. సోమవారంతో మళ్లీ మొదలైన రిజిస్ట్రేషన్లు స్పీడ్‌గా జరుగుతాయని ఆశించినప్పటికీ భూ క్రయవిక్రయదారులకు నిరాశే మిగిలింది. సోమవారం 108 స్లాట్లకు 86 స్లాట్లు బుక్ కాగా, ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం మూడు దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయి. 56 స్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాయని, మిగతా స్లాట్లు రీస్లాట్స్ చేసుకోవాల్సిందేనని ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సైదులు తెలిపారు. దీంతో భూక్రయ విక్రయదారులు సాయంత్రం 7 గంటల వరకు వరంగల్ ఆర్‌ఓ కార్యాలయంలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


