రేపు ‘రైతు భరోసా’ విడుదల | - | Sakshi
Sakshi News home page

రేపు ‘రైతు భరోసా’ విడుదల

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

ఖిలా వరంగల్‌: వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 30 (మంగళవారం) నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రైతు భరోసా పథకంలో ఎకరానికి రూ.6వేల చొప్పున జిల్లాలో మొత్తం 1,56,769 మంది రైతుల ఖాతాల్లో రూ.162.80కోట్లు జమ కానున్నాయి. 13 మండలాల్లో నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు మరో 2 వేల మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

పాత విధానంలోనే చెల్లింపు..

గత సీజన్లలో ఎకరం, రెండు ఎకరాలు, మూడెకరాలు.. ఇలా భూమి ఎంత ఉన్నా.. రోజుకో ఎకరం చొప్పున మొత్తం రైతులకు అందేవరకు రైతు ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు యాసంగి మాదిరిగా ఎకరా చొప్పున విడుదల చేస్తారా? లేక రైతులు కలిగి ఉన్న మొత్తం విస్తీర్ణానికి అందిస్తారా? అనే సందేహం రైతులను వెంటాడుతోంది. అయితే తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసి తదుపరి రెండు, మూడు ఎకరాలు.. ఇలా పెంచుకుంటూ దాదాపు పది రోజులు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సాగు ప్రారంభంలోనే ..

వానాకాలం సాగు పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దుక్కులు దున్నడానికి, విత్తనాలు నాటేందుకు పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పనుంది. సాగు ప్రారంభంలోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తుండటంతో ఇబ్బందులు తొలగనున్నాయి.

కొత్త వారికీ అవకాశం..

నూతనంగా పట్టా పాస్‌బుక్‌ పొందిన రైతులకు సైతం రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్‌లతో జూలై 5వ తేదీ వరకు ఆయా రైతు వేదికల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు రైతు భరోసా సాయం పొందుతున్న ప్రస్తుత లబ్ధిదారుల్లో బ్యాంకు ఖాతా మార్చుకోవాల్సిన రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు.

జిల్లాకు రూ.162.80 కోట్లు కేటాయింపు

1,56,769 మంది రైతులు

కొత్తగా పట్టాపాస్‌ పుస్తకం పొందిన వారికి కూడా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement