● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● జిల్లాలో 95.04 శాతం పూర్తి
గీసుకొండ: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని ధర్మారం కాకతీయ హైస్కూల్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో పాల్గొని ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం కోసం తల్లిదండ్రులు వారి ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డిస్టిక్ట్ ఇమ్యూనెజేషన్ ఆఫీసర్ ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రాజమౌళి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సాజిద, సయ్యద్ ఇక్తాదర్, సబ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ శౌర్య శరణ్య, సూపర్‌వైజర్ కిరణ్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
95.04 శాతం లక్ష్యం పూర్తి
జిల్లాలో తొలిరోజు (ఆదివారం) పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 75,621 మంది చిన్నారులకు 71,869 (95.04 శాతం) మందికి పల్స్‌పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. పోలియో చుక్కలు తీసుకోలేని మిగిలిన చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.


