సమస్యలు.. సవాళ్లు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు.. సవాళ్లు

Jun 29 2026 1:47 AM | Updated on Jun 29 2026 1:47 AM

గ్రేటర్‌లో అభివృద్ధికి ప్రతిబంధకాలెన్నో..

కీలక ప్రాజెక్టులు

రానున్న ఎన్నికలు, పౌర వేదనలు

ప్రతిష్టాత్మకం

నేడు గ్రేటర్‌ వరంగల్‌ పరిపాలన పగ్గాలు చేపట్టనున్న కమిషనర్‌ వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: నలుగురు యువ ఐఏఎస్‌ అధికాణిల తర్వాత గ్రేటర్‌ వరంగల్‌కు నాన్‌ ఐఏఎస్‌ అధికారి తేజవత్‌ వెంకన్న కమిషనర్‌గా సోమవారం(నేడు) బాధ్యతలు స్వీకరించనున్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న గ్రేటర్‌ వరంగల్‌లో కీలక ప్రాజెక్టులను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ), ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టాల్సి ఉంది. ప్రస్తుతమున్న 66 డివిజన్లను 100 డివిజన్లుగా పునర్విభజన చేయాలని మహా నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవేళ డివిజన్లు పెరిగితే డీ లిమిటేషన్‌ ప్రక్రియ కత్తిమీద సాము వంటింది. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పాలకవర్గం లేకపోయినప్పటికీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆదేశాలను అమలు చేయడం, పరిపాలన చక్కదిద్దడం కొంత కఠినమైన వ్యవహరమే. ఈనేపథ్యంలో.. రాష్ట్ర మున్సిపల్‌ శాఖకు చెందిన నాన్‌ ఐఏఎస్‌ అధికారి (గూప్‌–1) అధికారిగా పలు మున్సిపాలిటీల్లో, జీహెచ్‌ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కలిగి ఉన్న కొత్త కమిషనర్‌ తేజవత్‌ వెంకన్న చాకచక్యంతో బాధ్యతతో పనిచేస్తూ, సమస్యలను సవాళ్లను అధిగమించాల్సిన తరుణమిది.

పాలన గాడినపాడేనా?

మహా నగరంలో మరోమారు నాన్‌ ఐఏఎస్‌ పాలన మొదలుకానుంది. 2011లో ఐఏఎస్‌యేతర కమిషనర్‌గా జక్కుల శంకరయ్య పనిచేశారు. తర్వాత 2019 జీహెచ్‌ఎంసీలో అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేసిన గ్రూప్‌–1 అధికారి రవికిరణ్‌ ఆరునెలల పాటు పని చేశారు. తాజాగా అదే స్థాయి అధికారి వెంకన్న కమిషనర్‌గా విధుల్లో చేరనున్నారు.

జవాబుదారీతనమేది?

కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాల్లో సమస్యలపై ప్రజలు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు జవాబుదారీతనం కరువైంది. వింగ్‌ అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి, ఆస్తుల విభజన, కొత్త నల్లా కనెక్షన్‌, ట్రేడ్‌ లైసెన్స్‌, మార్టిగేజ్‌ రిలీజ్‌ ఇలా.. ఏది కావాలన్నా పైసలిస్తేనే పనులు చేస్తున్నారని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. సిటిజన్‌ చార్టర్‌ నిబంధనలు పట్టించుకోవట్లేదు. నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement