హన్మకొండ: కోటి ఆశలతో వానాకాలం సాగుకు సిద్ధమైన రైతులతో ప్రకృతి దోబూచులాడుతోంది. సీజన్ ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా చినుకు జాడలేదు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వర్షపాతం నమోదు కాలేదు. పంటల సాగుకు సిద్ధమైన రైతులు ఆదిలోనే ఆందోళనకు గురవుతున్నారు. రోహిణి, మృగశిర కార్తెలు పోయి ఆరుద్ర కార్తె ప్రవేశించినా వరుణుడు కరుణించకపోవడంతో ఏం చేయాలో రైతన్నకు పాలుపోవడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయని ఆశించారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు రోజురోజుకూ దూరమవుతున్నాయి. గత సంవత్సరం జూన్ 26 నాటికి జిల్లాలో సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 79.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది ఇదే సమయానికి జిల్లా సగటు సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు కాగా.. 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది సాధారణ సాగు విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా.. ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 54,790 ఎకరాల్లో సాగు చేశారు.
77 శాతం లోటు వర్షపాతం..
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సగటు సాధారణ విస్తీర్ణం 117.8 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటివరకు 27 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 77 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా జిల్లా కేంద్రం హనుమకొండలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 125.2 మిల్లీమీటర్ల కాగా.. 4.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇక్కడ 96 శాతం తీవ్రలోటు ఉంది.
విత్తనాలు వేయలేదు..
పరకాల: వాతావరణం చల్లగా ఉందని.. తొలకరి వర్షం పడగానే ఎంతో సుంబురపడ్డం. కానీ, పంటసాగుకు అనుకూలమైన వర్షాలు లేక దుక్కులు దున్ని విత్తనాలు వేయకుండా వదిలిపెట్టాల్సి వచ్చింది. 5 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయడానికి కూడా సిద్ధం చేసుకున్నా.
– దుమాల మొగిలి, రైతు మల్లక్‌పేట
కార్తెలు పోతున్నా.. కానరాని వానజాడ
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సాధారణ వర్షపాతం 117.8 మిల్లీమీటర్లు
కురిసిన వర్షం 27 మిల్లీమీటర్లు మాత్రమే..


