‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి
హన్మకొండ చౌరస్తా: కుడాకు సంబంధించిన రూ.45 కోట్ల నిధులను చట్టవిరుద్ధంగా కార్పొరేషన్‌కు బదిలీ చేయించిన మాజీ మంత్రి కేటీఆర్‌పై విజిలెన్స్ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈకార్ కేసు మాదిరిగా కుడా నిధులను సైతం మంత్రి హోదాలో ఆనాడు కేటీఆర్ తన ఇష్టానుసారంగా కార్పొరేషన్‌కు మళ్లించాడన్నారు. వేలంలో కుడాకు రూ.50 కోట్ల నష్టం జరుగుతుందని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.150 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని, కుడా భూములను కబ్జా నుంచి కాపాడేందుకు బ్లూప్రింట్ తీశామని వివరించారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేశామని అన్నారు.


