దుగ్గొండి: గుప్త నిధుల కోసం కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తవ్వకాలు చేపట్టగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మండల పరిధిలోని నాచినపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలోని పోచమ్మ ఆలయం వీధిలో ఓ వ్యక్తికి చెందిన పెరటి భూమిలో 8 మంది అనుమానాస్పదంగా చుట్టూ పరదాలు కట్టి గుంత తవ్వుతున్నారు. గుంతలో పసుపు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, దీపాలు వెలిగించి ఉంచారు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురై సర్పంచ్ పెండ్యాల రాజుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 8 మంది వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అయితే భూమి యజమాని మాత్రం ఎల్ల మ్మ ఆలయం కడుతున్నానని ఒకసారి, మైసమ్మను ప్రతిష్టించుకుంటున్నానని పొంతన లేని సమాధానం ఇస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు.


