మామునూరు: వరంగల్ మామునూరుకు మాహర్దశ పట్టనుంది. ఉమ్మడి రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన పశుపరిశోధన స్థానం, టీఎస్‌ఎస్పీ బెటాలియన్, పోలీస్ శిక్షణ కళాశాల, పశుపాలిటెక్నిక్, కృషివిజ్ఞాన కేంద్రం, వెటర్నరీ డిగ్రీ కళాశాలు ఇక్కడ ఉన్నాయి. నూతనంగా మామునూరుకు విమానాశ్రయం పునరుద్ధరణతోపాటు ఈవీ ఆర్టీసీ బస్‌డిపో, క్రికెట్ స్టేడియం, పరిశ్రమల ఏర్పాటు, హనుమకొండ నుంచి వరంగల్ ఆర్డీఓ కార్యాలయం తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద చెరువును అధునిక హంగులతో మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే మామునూరు మండల కేంద్రంగా ప్రకటించాలని సాధన సమితి ఉద్యమాలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మామునూరుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలనే లక్ష్యంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక దృష్టిసారించారు. జాతీయ రహదారి పక్కనే పశుసంవర్థక శాఖకు చెందిన సుమారు ఆరు ఎకరాల భూమి ఉండగా.. మూడు ఎకరాల్లో ఈవీ బస్‌డిపోను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. రోడ్డు పక్కన విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. వరంగల్ ఆర్డీఓ టి.సుమ శనివారం పశుసంవర్థక శాఖ స్థలాన్ని సందర్శించారు. తహసీల్దార్ ఇక్బాల్‌తో కలిసి ఈవీ డిపో ఏర్పాటు, క్రికెట్ స్టేడియం, పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసినట్లు తెలిసింది. స్థానికులు, ఆర్టీసీ అధికారులో ఆర్డీఓ మరోసారి చర్చించారు. మామునూరు పరిధిలోని అనేక ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈవీ ఆర్టీసీ డిపో ఏర్పాటు కోసం సర్వే అధికారులు రంగంలోకి దిగి కొలతలు వేసి భూమి విస్తీర్ణం తెలియజేయాలని ఆమె ఆదేశించారు. దీనిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేయనున్నట్లు ఆర్డీఓ సుమ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అఽధికారులు, స్థానికులు ఎర్ర విజయ్‌కుమార్, మాచర్ల కుమారస్వామి, మన్నె బాబురావు, బండి సాంబయ్య యాదవ్, మన్నె భిక్షపతి, దేవానందం, పాపిరెడ్డి, కోటేశ్వర్ పాల్గొన్నారు.


