● బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్,
రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
హన్మకొండ: రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు, రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శనివారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని వేద బాంక్వెట్ హాల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్తులను కొల్లగొట్టడం, ప్రజలను వంచించడం మినహా చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని సమదృష్టితో చూస్తోందన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన కొత్తగా చేస్తున్నదేమి కాదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ముస్లింలు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లింలని సీఎం రేవంత్ అంటున్నారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనతోనే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని, 12 ఏళ్ల నరేంద్రమోదీ పాలనలో రాష్ట్రానికి కేంద్రం రూ.130 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు. ఒక్క రైల్వేకు రూ.3,000 కోట్లు ఇచ్చిందని, రైల్వే స్టేషన్లను అధునీకరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారని, ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 29న హనుమకొండలోని అశోక హోటల్‌లో జరిగే ఆదివాసీ గిరిజన సదస్సు, అనంతరం సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ పోలింగ్ బూత్, ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని లక్ష్మణ్ వివరించారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్‌రెడ్డి, గంట రవికుమార్, నాయకులు మార్తినేని ధర్మారావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.


