నియామకాల ఊసేలేదు..! | - | Sakshi
Sakshi News home page

నియామకాల ఊసేలేదు..!

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

కాళోజీ సెంటర్‌ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేసి, వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల (హెల్పర్స్‌) నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తమై నియామక ప్రక్రియలో నిమగ్నమవగా.. మన జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా భర్తీ ప్రక్రియ ముందుకుసాగడంలేదు. జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌ ప్రాజెక్టులు ఉండగా 919 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2018 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్‌ ప్రక్రియను 2022 వరకు సాగదీసి నియామకాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్‌ రాకపోవడంతో వేల సంఖ్యలో నిరుద్యోగులు ఎదరుచూస్తున్నారు. పాత లెక్కల ప్రకారం 63 మంది టీచర్లు, 289 ఆయా(హెల్పర్స్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ లెక్కలు తీస్తే మరిన్ని ఖాళీల సంఖ్య పెరిగే అవగాశం ఉంది.

తాజా ఖాళీల వివరాలేవి ?

జిల్లాలో ప్రస్తుతం ఎన్ని అంగన్‌వాడీ టీచర్‌, ఆయా(హెల్పర్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయనే కనీస సమాచారం కూడా జిల్లా సంక్షేమ శాఖ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. అధికారుల వద్ద ప్రస్తుతం ఉన్నవి పాత ఖాళీల వివరాలే. 2018 నుంచి ఇప్పటి వరకు వయోపరిమతి తీరి ఎంత మంది పదవీ విరమణ చేశారు? వ్యక్తిగత కారణాలతో ఎంత మంది రాజీనామా చేశారు? కొత్తగా ఏర్పడిన ఖా ళీలు ఎన్ని? అనే లెక్కలు తేల్చడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ ఆశయానికి తూట్లు..

సుదీర్ఘకాలం తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలందించాలనే ప్రభుత్వ ఆశయానికి సంబంధిత శాఖ అధికారుల తీరు విరుద్ధంగా మారింది. దీంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉంది. ఇతర జిల్లాల్లో ఖాళీల జాబితా, రిజర్వేషన్‌, రోస్టర్‌ లెక్కలు తీసి నోటిఫికేషన్‌ విడుదల చేయగా వరంగల్‌ జిల్లాలో మాత్రం ఎలాంటి ప్రక్రియ చేపట్టకపోవడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన తాజా ప్రకటనతో ఈ నియామకాల ద్వారా ఉద్యోగం సాధించవచ్చని ఆశగా ఎదురుచూస్తున్న అర్హులైన మహిళా నిరుద్యోగులు.. అధికారుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే జిల్లాలోని అంగన్‌వాడీ ఖాళీల వివరాలను సేకరించి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతున్నారు.

ఖాళీల జాబితాకు

సమయం పడుతుంది

ప్రస్తుతానికి మా వద్ద తాజా ఖాళీల వివరాలు లేవు. వాటిని సేకరించడానికి చాలా సమయం పడుతుంది. రోజూ కలెక్టరేట్‌ నిర్వహించే సమావేశాలకు వెళ్లడంతోనే సమయం గడిచిపోతోంది. ఆ మీటింగ్‌లకు ఎప్పుడు వెళ్లాలి. ఈ పనులు ఎప్పుడు చేయాలి. జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చెప్పడానికి కొంత సమయం పడుతుంది.

– బి.రాజమణి, డీడబ్ల్యూఓ

అంగన్‌వాడీల్లో కొలువులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

జిల్లాలో ప్రారంభంకాని ప్రక్రియ

తొమ్మిదేళ్ల క్రితం నాటి లెక్కలతోనే కాలయాపన

తాజా ఖాళీలపై స్పష్టత లేని వైనం

ప్రాజెక్టు ఏరియా టీచర్‌ ఆయా(హెల్పర్‌)

నర్సంపేట 21 94

వర్ధన్నపేట 19 66

వరంగల్‌ 23 129

మొత్తం 63 289

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement