● ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి
వరంగల్ చౌరస్తా: నూతన హంగులతో రోల్ మోడల్‌గా నిర్మిస్తున్న వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం తగదని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.75 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని, పనుల్లో మరింత వేగం పెంచాలని సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను, అధికారులను ఆయన హెచ్చరించారు. వరంగల్ నగరాన్ని అద్భుతమైన ఐటీ, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన రవాణా వ్యవస్థ ఎంతో కీలకమని, ఇందుకోసం ‘కుడా’ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.


