విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

కలెక్టర్‌ సత్యశారద

కాళోజీ సెంటర్‌ : ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మిడ్‌ డే మిల్స్‌ కమిటీ సమావేశంలో పథకం అమలు తీరును కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అన్ని ఇంటర్‌ కళాశాలలకు ప్రత్యేక అధికారులను నియమించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) వైవీ గణేష్‌ను ఆదేశించారు. అధికారులు కళాశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరించి భోజన నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

కాళోజీ సెంటర్‌ : జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, కేర్‌టేకర్లు, సీఆర్‌పీలు, ఐజీఆర్‌పీ, ఏఎన్‌ఎంలు, హాస్టల్‌ సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులు, బాధ్యతలు, విద్యార్థులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, అసభ్యకర భాష, ప్రవర్తన సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే తక్షణమే సవరణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు.

‘సర్‌’ హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

కాశిబుగ్గ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)పై సందేహాల నివృత్తిచేయడానికి వరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ను కలెక్టర్‌ సత్యశారద గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె హెల్ప్‌ డెస్క్‌ పనితీరును పరిశీలించి, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన సేవలను ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించాలన్నారు. అనంతరం వరంగల్‌ కొత్తవాడ. దేశాయిపేట, దేశాయిపేటలో ఎస్‌ఐఆర్‌ సర్వేను కలెక్టర్‌ సత్యశారద పరిశీలించారు.

గడువులోగా స్కూల్‌ పనులను పూర్తి చేయాలి

వరంగల్‌ చౌరస్తా: విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (టీఐఆర్‌ఎస్‌) పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్య శారద అన్నారు. వరంగల్‌ మండలం పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్సియల్‌ స్కూల్‌ పనులను గురువారం ఆమె పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న సిమెంట్‌ గ్రేడ్‌, ఇనుము నాణ్యత, ఇటుకల దృఢత్వం గురించి ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఆయా సమావేశాలు, కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ గణేష్‌, ఇంటర్మీడియట్‌ అధికారి శ్రీధర్‌ సుమన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, టీబీసీడీఓ పుష్పలత, డీఈఓ రంగయ్య నాయుడు, ఏఎంఓ ఉండ్రాతి సుజన్‌ తేజ, సీఎంఓ కట్ల శ్రీనివాస్‌, జీసీడీఓ ఫ్లోరెన్స్‌, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ విజయ్‌ కుమార్‌, స్టాటిస్టికల్‌ కోఆర్డినేటర్‌ వేణుగోపాల్‌ రావు, వరంగల్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement