నర్సంపేట: ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి అసలైన ఓటర్లను గుర్తించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమానికి సంబంధించిన హెల్ప్ డెస్క్‌ను ఆమె ప్రారంభించి ఆమె మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా అధికారులు, సిబ్బంది పారదర్శకంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో బాలికలదే పైచేయి
కాళోజీ సెంటర్: ఇటీవల నిర్వహించిన టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 86.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో మొత్తం 503 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 437 మంది ఉత్తీర్ణత సాధించారు. 208 మంది బాలికల్లో 185(88.94 శాతం) మంది, 295 మంది బాలురలో 252 మంది(85.42శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలపై డీఈఓ రంగయ్యనాయుడు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
రేపు కిట్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా
కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 శనివారం భారీ మెగా జాబ్ మేళా ‘వరంగల్ కౌశల్ మహోత్సవ్ – 2026’ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి.సాత్విక గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ), స్కిల్ ఇండియా, ఎన్‌ఎస్‌డీసీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. హసన్‌పర్తి ఎర్రగట్టు సమీపంలోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల (కిట్స్) లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో 50కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని 5 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయని, ఉద్యోగాలతోపాటు డిజిటల్ స్కిల్లింగ్, అప్రెంటిస్‌షిప్, ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఇతర వివరాల కోసం 88000 55555, 1800 123 9626 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
నితిన్ నబిన్ పర్యటనను విజయవంతం చేయాలి
గీసుకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హనుమకొండలో పాల్గొనే సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవుని మేఘనాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాదారపు శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటలో డివిజన్ స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. డివిజన్ అధ్యక్షుడు ల్యాదల్ల ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బిల్లా రమేశ్, నాయకులు రాదారపు మల్లికార్జున్, బందెల రేణుక తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబా ద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరి గొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
మాదకద్రవ్యాల నివారణకు కృషిచేయాలి
దామెర: మాదకద్రవ్యాల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒగ్లాపూర్ సమీపంలోని ఎంజేపీ, సాంఘిక సంక్షేమ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.


