పెండింగ్‌ డీఏలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ డీఏలు చెల్లించాలి

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

రంజిత్‌ కుమార్‌

కాళోజీ సెంటర్‌ : పీఆర్‌సీ అమలుతోపాటు పెండింగ్‌ డీఏలను ప్రకటించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎస్‌టీఎఫ్‌ఐ పిలుపుమేరకు టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ, వరంగల్‌ జిల్లా శాఖల ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హనుమకొండ కాళోజీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ 36 నెలలు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు పెండింగ్‌లో పెట్టారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ–2020) ని రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. టీఎస్‌ యూటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్‌ మాట్లాడుతూ.. తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు. డిప్యూటీ డీఈఓలు, డైట్‌ లెక్చరర్లు, బీఈడీ కాలేజీ లెక్చరర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. టీచర్లకు టెట్‌ మినహాయించాలన్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలన్నారు. జూలై, ఆగస్టు నెలలో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. అనంతరం వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సృజన్‌ ప్రసాదరావు మాట్లాడారు. నిరసన అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నామోజు శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి రవుఫ్‌, జిల్లా కార్యదర్శులు కందగట్ల రమేష్‌, నాయకులు గుండు కర్ణాకర్‌, సత్యనారాయణ, సంపత్‌, అరవింద్‌ కుమార్‌, కుమారస్వామి, రవీందర్‌, రామరాజు, జోగయ్య ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement