ప్రజారోగ్యం! | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యం!

Mar 13 2026 7:29 AM | Updated on Mar 13 2026 7:29 AM

ప్రమాదంలో
ప్రజల ప్రాణాలతో నకిలీ వైద్యుల చెలగాటం

సాక్షి, వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నకిలీ వైద్యుల బెడద ఊపందుకుంటుంటే, ఇంకోవైపు ఎంబీబీఎస్‌ చదివిన కొంతమంది తమకు లేని స్పెషలైజేషన్‌ అర్హతను చేర్చుకొని వైద్యం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అనుమతి లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ, వైద్యులమని చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాల మీదికి తెస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. చిన్న క్లినిక్‌ల నుంచి ఆస్పత్రుల వరకు కొందరు తమకు లేని అర్హతను ఉన్నట్లుగా ప్రకటనలు, ప్రిస్కిప్షన్లు ఇస్తూ రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వైద్య వృత్తిని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నారు. దీంతో ప్రజలు నిజమైన వైద్యులు ఎవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ (టీజీఎంసీ) చేసిన దాడుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 126 కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యుల సమాచారం 9154382727 వాట్సాప్‌ ద్వారా ఇస్తే చర్యలు తీసుకుంటోంది.

స్పెషలిస్ట్‌.. సూపర్‌ స్పెషలిస్ట్‌

పదాలు వాడుతూ..

ప్రత్యేక వైద్య విద్య (ఎండీ, ఎంఎస్‌) లేకపోయినా కొందరు వైద్యులు తమ క్లినిక్‌ల వద్ద ‘స్పెషలిస్ట్‌’, ‘సూపర్‌ స్పెషలిస్ట్‌’ వంటి పదాలను ఉపయోగిస్తూ రోగులను ఆకర్షిస్తున్నారు. దీంతో రోగులు వారికి పూర్తి అర్హతలు ఉన్నాయనే భావనతో చికిత్స పొందుతున్నారు. అర్హతలు లేకుండా స్పెషలైజేషన్‌ పేరుతో వైద్యం చేయడం వైద్య నైతిక నియమాలకు విరుద్ధమని వైద్యారోగ్య విభాగాధికారులు చెబుతున్నారు. నకిలీ వైద్యులు, అర్హతలు లేని వ్యక్తులు చికిత్స చేయడంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థ విద్య మాత్రమే ఉన్నవారు కూడా క్లినిక్‌లు నడుపుతూ యాంటీబయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ వంటి మందులు ఇస్తున్న ఘటనలు బయటపడినట్లు ఆరోగ్య శాఖ పరిశీలనల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమ వైద్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని ప్రైవేట్‌ క్లినిక్‌లు, ఆస్పత్రుల అర్హతలను ఆరోగ్య శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి నకిలీ వైద్యులు, తప్పుదారి పట్టించే ప్రకటనలపై కఠిన చర్యలు వైద్యారోగ్యవిభాగాధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, ప్రజలు చికిత్స పొందే ముందు వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్‌ వివరాలు పరిశీలించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

అర్హత, అనుభవం లేకున్నా యథేచ్ఛగా క్లినిక్‌ల నిర్వహణ

ఎంబీబీఎస్‌ చదివినా స్పెషలిస్ట్‌ అని

కొంతమంది ప్రలోభాలు

నిజమైన వైద్యులెవరో తెలియక

ప్రజల గందరగోళం

ఫేక్‌ డాక్టర్ల సమాచారం 9154382727కు వాట్సాప్‌ చేయండి

ప్రజలకు తెలంగాణ వైద్య మండలి విజ్ఞప్తి

మచ్చుకు కొన్ని కేసులు..

వరంగల్‌లోని కాశీబుగ్గలో షేక్‌ నయీంపాషా ఎంబీబీఎస్‌ డిగ్రీ లేకుండా అనధికారికంగా వైద్యుడిగా చెలామణి అవుతూ చికిత్స, మందులు ఇస్తున్నారని కేసు నమోదైంది.

వైద్యపరంగా విద్యార్హత లేకుండా వైద్యులుగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఏనుమాములలో బోయిని శంకర్‌ (కల్యాణి క్లినిక్‌), కర్రు రాజేందర్‌ (జయశ్రీ ఫర్ట్స్‌ ఎయిడ్‌ సెంటర్‌), పి.రమేశ్‌ (శ్రీవెంకటేశ్వర ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్‌)పై కూడా టీజీఎంసీ కేసులు నమోదు చేసింది.

ఎంబీబీఎస్‌ విద్యార్హత లేకున్నా మడికొండలో టి.రాజయ్య, ఈ.జయరాం, భాగ్యలక్ష్మి వైద్యులుగా చెలామణి అవుతూ చికిత్స అందిస్తుండడంతో కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement