సమన్వయ
లోపం..
ఉమ్మడి వరంగల్ శిశుగృహలో దత్తత పిల్లలకు బాలారిష్టాలు
● 13 మందిలో ముగ్గురికి మార్గం సుగమం.. మిగిలిన వారికి అడ్డంకులు
● శిశువుల అక్రమ దత్తత కేసుల్లో ఐదుగురికి తప్పని నిరీక్షణ
● డీఎన్‌ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల్లో నలుగురికి ఆలస్యం
● అధికారులు, కోర్టుల కేసులతో దత్తతకు ఎదురుచూపులు
● పోక్సో కేసుల మాదిరిగానే ఈ కేసుల్లో వేగం పెంచాలి
సాక్షి, వరంగల్: జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా సంక్షేమ అధికారులు, వైద్యారోగ్య విభాగాలు, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడడం.. దత్తతకు పోయే శిశువులకు శాపంగా మారుతోంది. అక్రమంగా దత్తత కేసులు, డీఎన్‌ఏ పెండింగ్ కేసులు, అపహరణ కేసులతో హనుమకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యప్తంగా హనుమకొండలో ఉన్న ఒకేఒక శిశుగృహలోని 13 మంది పిల్లల్లో 10 మంది దత్తతకు అనర్హులుగా ఉండడంతో ఆ పిల్లలు.. కుటుంబ ఆలనపాలన దూరమవుతున్నారు. వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పోక్సో కేసుల మాదిరిగానే ప్రత్యేక దృష్టితో దత్తతకు సంబంధించిన కేసులను పరిష్కరిస్తే శిశువులు త్వరగా కుటుంబ వాతావరణంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని బాలల హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఆయా విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే శిశువులకు న్యాయం జరుగుతుందనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ కేసులో పిల్లల అక్రమ దత్తతలో వ్యవహారం చైల్డ్ ట్రాఫికింగ్ (అక్రమ రవాణా)కు దారితీసి, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని, ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలతో.. వారిని పెంచుకుంటున్న తల్లిదండ్రులకు ఎంత అనుబంధమున్నా ఆ దత్తతను అనుమతించలేమని, దత్తత విషయంలో కేంద్రం రూపొందించిన సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ (కారా) మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు ఇటీవల తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో శిశుగృహలో ఉంటున్న నెలల పాపల నిరీక్షణ అంశం తెరమీదకు వచ్చింది.
సమన్వయంతోనే ముందుకు సాగాలి
అక్రమంగా దత్తత తీసుకున్న శిశువులను తిరిగి పొందేందుకు కొందరు వ్యక్తులు కోర్టుల్లో కావాలనే కేసులు వేస్తుండడం వల్ల దత్తత వ్యవహారాలు ఆలస్యమవుతున్నాయి. చట్టబద్ధంగా కాకుండా పిల్లలను తీసుకున్న సందర్భాల్లో అధికారులు శిశువులను ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకుంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో శిశువులను తిరిగి పొందేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తూ ప్రక్రియను దీర్ఘకాలం పాటు సాగదీస్తున్నారు. పత్రాల ధ్రువీకరణ, అసలు తల్లిదండ్రుల గుర్తింపు, డీఎన్‌ఏ పరీక్షలు వంటి అంశాలు కూడా కోర్టు విచారణల్లో కీలకమవుతున్నాయి. ఈ కారణాలతో కేసులు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండి చట్టబద్ధ దత్తత ప్రక్రియకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ కేసులను అన్ని విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే త్వరగా కోర్టు ఆదేశాలు వచ్చి దత్తతకు మార్గం సుగమం అవుతుంది.
ప్రాధాన్యతా క్రమంలో వేగం పెంచాలి
దత్తత లేదా శిశువుల మార్పిడి, అపహరణ వంటి కేసుల్లో శిశువు నిజమైన తల్లిదండ్రులను గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు కీలకం. కేసు నమోదు అనంతరం పోలీసులు శిశువు, అనుమానిత తల్లిదండ్రుల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపాలి. సాధారణంగా ఈ పరీక్షల ఫలితాలు 15 నుంచి 30 రోజుల్లో వెలువడాలి. అత్యవసర పరిస్థితుల్లో కోర్టుల ఆదేశాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో పరీక్షలు నిర్వహించి ఒకటి నుంచి రెండు వారాల్లోనే నివేదిక ఇవ్వాలి. అయినా ఈ కేసులను ఆయా అధికారులు ఇతర కేసుల ఒత్తిడితో ఫాలోఅప్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో జాప్యం అవుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నిబంధనల ప్రకారం పిల్లల గుర్తింపు, తల్లిదండ్రుల నిర్ధారణ త్వరగా చేయాలి. జువెనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ 2015 ప్రకారం శిశువుల సంరక్షణ, దత్తత వ్యవహారాలు త్వరగా పరిష్కరించాలని సామాజికవేత్తలు అంటున్నారు.
గుర్తుతెలియని శిశువుల దత్తతలోనూ అదే తీరు
కిడ్నాప్ కేసుల్లో పోలీసులకు దొరికిన గుర్తు తెలియని శిశువులను దత్తత ఇవ్వడంలో అనేక చట్టపరమైన ప్రక్రియలు ఉండడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ముందుగా శిశువు అసలు తల్లిదండ్రులు ఎవరన్నది పోలీసులు గుర్తించాలి. శిశువు అపహరణకు గురైందా లేదా అన్నది నిర్ధారించేందుకు వివిధ ప్రాంతాల్లో మిస్సింగ్ కేసుల వివరాలను పరిశీలించాలి. అలాగే శిశువును తాత్కాలికంగా శిశుగృహలో ఉంచి కోర్టు ఆదేశాలు పాటించాలి. ఇలా శిశువు కేసుల్లో పోలీసులు వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ దత్తత ప్రక్రియలో సీడబ్ల్యూసీ అనుమతి, ప్రతి కేసు నివేదిక, ప్రొసీడింగ్స్, ఆర్డర్స్, శిశువు ఆరోగ్య పరీక్షల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి కావడంతో ఆలస్యమవుతోంది.
పెండింగ్‌లో ఉన్న కేసులు..
2024 జూలై 25న జనగామ జిల్లాలో పోలీసులకు, జిల్లాల బాలల సంరక్షణ విభాగం, జిల్లా బాలల సంక్షేమ కమిటీకి దొరికిన 25 రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కింద కోర్టులో నడుస్తుండడంతో ఇంకా పాపను దత్తత ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ రాలేదు. 2024 ఆగస్టు 27న మహబూబాబాద్ జిల్లాలో 39 రోజుల బాబు, 2024 నవంబర్ 19న ములుగు జిల్లాలో దొరికిన ఐదు నెలల 15 రోజుల పాప, 2025 జూన్ 5న ములుగు జిల్లాలో దొరికిన 20 రోజుల పసికందు, 2025 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలో దొరికిన రెండు నెలల నాలుగు రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కోర్టు కేసులు నడుస్తుండడంతో దత్తతకు అనర్హులుగా ఉన్నారు.
2025 నవంబర్ 26న లభ్యమైన 36 రోజుల పాప, 2025 డిసెంబర్ 24న లభ్యమైన ఒకరోజు మగబాబు, 2026 ఫిబ్రవరి 8న లభ్యమైన ఒకరోజు పాప డీఎన్‌ఏ పెండింగ్‌లో ఉంది. 2026 జనవరి 10న కిడ్నాప్ కేసులో దొరికిన 8నెలల పాప, 16 నెలల పాప తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనాల్సి ఉండడంతో వారు కూడా పెండింగ్‌లో ఉన్నారు.


