● లీవ్ పెట్టకుండా గైర్హాజరైన జూనియర్ అసిస్టెంట్
● సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించిన సత్యశారద
సంగెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అపరిశుభ్రతపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రభుత్వ పాఠశాలను బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని గోడలు బూజుపట్టి, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగులకు వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రిలో లీవ్ పెట్టకుండా జూనియర్ అసిస్టెంట్ శాలిని ఎలా గైర్హాజరయ్యారని వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణను ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించారు. పాత కార్యాలయాలకు రంగులు వేయించి కొత్తవాటిలా కనిపించేలా చూడాలన్నారు. రెండు రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటివరకు అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సాంబశివరావు, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, స్థానిక సర్పంచ్ పేర్ల లలిత తదితరులు పాల్గొన్నారు.
నేడు సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు శిక్షణ
● గీసుకొండ మండలంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
గీసుకొండ: జిల్లాలోని 11 మండలాల్లోని సర్పంచ్‌లు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిలర్లకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై గురువారం ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. గీసుకొండ మండలం మరియపురం సమీపంలోని ఎస్‌ఎస్ గార్డెన్స్‌లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను బుధవారం పరిశీలించిన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. స్థానిక ప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, శిక్షణకు అవసరమైన పుస్తకాలు, ప్రదర్శన సామగ్రిని సిద్ధం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 99 రోజుల పాటు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులు, మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, తహసీల్దార్లు ఎండి.రియాజుద్దీన్, రాజ్‌కుమార్, ఎంపీడీఓ కృష్ణవేణి, అధికారులు పాల్గొన్నారు.


