● డీఈఓ రంగయ్య నాయుడు
కాళోజీ సెంటర్: ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) నైపుణ్యాలు చాలా ముఖ్యమని, 3వ తరగతి నాటికి ప్రతీ విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో పటిమ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్య నాయుడు సూచించారు. డైట్ కళాశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ – ఏఎక్స్‌ఎల్‌ఏఐ టీచర్స్ ట్రైనింగ్‌ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ జిల్లాలోని 11 పాఠశాలలకు చెందిన 50 శాతం మంది ఉపాధ్యాయులు, డీఆర్‌పీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారని, మిగతా 50 శాతం మంది ఉపాధ్యాయులకు 12న ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విద్యారంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఎక్స్‌ఎల్‌ఏఐ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి విద్యార్థుల అభ్యాసన స్థాయిని అంచనా వేసి బోధనను మెరుగుపర్చాలని అన్నారు. ఏఎంఓ సుజన్‌తేజ మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగు పర్చాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధ్యాయుల పాత్ర అత్యంత ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో డైట్ కళాశాల అధ్యాపకులు సోమయ్య, డీఆర్‌పీలు గంగాధర్, సౌజన్య, నరేందర్, పద్మజ పాల్గొన్నారు.


