హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్‌ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది.
20.16 కోట్ల రాయితీ విడుదల
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్‌లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్‌స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్‌కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు.
విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు..
సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఉమ్మడి జిల్లాలో సోలార్ ఫలకల ఏర్పాటు ఇలా.. (కెపాసిటీ మెగావాట్లలో)
పీఎం సూర్యఘర్‌తో ఉచిత విద్యుత్
300 యూనిట్ల వరకు వినియోగం
ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్‌కు 9,058 దరఖాస్తులు
ఇప్పటి వరకు 2,939 రూఫ్‌టాప్
ఇన్‌స్టలేషన్
దరఖాస్తు ఇలా..
ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్‌సైట్‌లో వెండర్‌ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్‌మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది.
జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్‌స్టలేషన్ కెపాసిటీ
సర్వీస్‌లు దరఖాస్తులు
భూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63
హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53
వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33
జనగామ 1,76,061 491 1.50 211 0.67
మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79


