పిల్లల దత్తత కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపులు
సాక్షి, వరంగల్: పిల్లల దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా వరంగల్ జిల్లా బాలరక్షా భవన్‌లోని ముగ్గురు సిబ్బందిదేనని తేలడంతో దత్తతకు దరఖాస్తు చేసుకున్న దంపతులకు పిల్లల అప్పగింత లైన్‌క్లియర్ అయినట్లేనా.. లేక కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) నిబంధనలు ఏమైనా అడ్డంకిగా మారుతాయా అన్న చర్చ జరుగుతోంది. అయితే, దత్తతకు సంబంధించిన కేసులో జరిగిన పరిణామాలను వివరిస్తూ కారాకు సమగ్ర నివేదిక పంపడం ద్వారా వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. తొలుత వీరిపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా, ఆ తర్వాత విచారణ క్రమంలో వెలుగుచూసిన వాస్తవాలతో అయినా జిల్లా సంక్షేమ విభాగం ఆధ్వర్యంలోని బాలరక్షా భవన్ దత్తత విభాగాన్ని కనీసం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇతర విభాగం ఉద్యోగికి బాధ్యతలు
గతేడాది జిల్లా బాలరక్షా భవన్‌లో సిబ్బందిని పూర్తిస్థాయిలో రెన్యూవల్ చేయకపోవడం, దత్తత అంశంపై పూర్తిస్థాయిలో పట్టున్న అధికారులు లేకపోవడం, ఆ బాధ్యతలను ఇతర విభాగానికి చెందిన ఓ ఉద్యోగికి అప్పగించగా.. సదరు ఉద్యోగి చూసీచూడనట్టు వ్యవహరించడంతో పిల్లలు కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బాలసముద్రంలోని బాలరక్షా భవన్‌కు దంపతులు వచ్చి పిల్లలు ఎప్పుడూ వస్తారని వాకబు చేస్తుండగా, త్వరలోనే మీ సమస్య తీరుతుందంటూ అధికారులు చెప్పి పంపిస్తున్నారు. అయితే, ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సర్టిఫికెట్ల కేసులో బాధితులుగా ఉన్న దత్తత కోరే దంపతుల్లో ఇద్దరి దరఖాస్తులు రిజెక్ట్ కాగా, ఒకరిది అప్లికేషన్ క్యాన్సల్ రిక్వెస్ట్ అని, మరో ఇద్దరిది రీవ్యాలిడేషన్.. ప్యాప్స్ వద్ద పెండింగ్‌లో ఉందని, మరొకరు సీనియారిటీ లిస్ట్‌లో ఉన్నారు. ఈ విషయాలపై సదరు అధికారులకు అవగాహన లేకపోవడమే పిల్లలను దత్తత కోరే దంపతులకు శాపంగా మారింది. ఇప్పటికే గత మూడు నుంచి ఐదేళ్లుగా పిల్లల కోసం వేచి చూస్తూ సీనియార్టీ లిస్టులో ఉన్న వారికి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది.
ఇంత జరిగినా రీవ్యాలిడేషన్‌లో నిర్లక్ష్యమే..
బాలల న్యాయ చట్టం –2015 ప్రకారం కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కారా ద్వారా బాలలను దత్తత తీసుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కారా.నిక్.ఇన్ అందుబాటులోకి వచ్చింది. దంపతుల వయస్సును బట్టి అర్హత గల శిశువులను దత్తత ఇస్తారు. శిశువుల దత్తత కోసం దంపతులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి గృహ సందర్శన (హోం స్టడీ) చేసి నివేదికను సిద్ధం తయారు చేసి కారా వెబ్‌సైట్‌లో అధికారులు నిక్షిప్తం చేస్తారు. ఆ నివేదికకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఆలోపు శిశువును దత్తత తీసుకోకుంటే మళ్లీ మూడేళ్ల అనంతరం వారికిచ్చే లాగిన్ ఐడీ ద్వారా గృహ సందర్శన నివేదికను రెన్యూవల్ చేయాలి. ఒకవేళ ఎవరైనా దంపతుల వ్యాలిడేషన్ అయిపోయినా కూడా వారికి సమాచారం ఇచ్చి ఫాలోఅప్ చేయాలి. 60 రోజుల్లో నివేదికను తయారుచేసి వెబ్‌సైటలో అప్‌లోడ్ చేయాలి. కానీ, అందుకు భిన్నంగా జిల్లా బాలల సంరక్షణ దత్తత సెక్షన్ అధికారి.. రీవ్యాలిడేషన్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. వాటితో పాటు రిజెక్ట్ అయిన ఇద్దరిది, అప్లికేషన్ క్యాన్సల్ రిక్వెస్ట్ అని మరొకరు సీనియర్ లిస్ట్‌లోకి రావాలంటే కారాకు సమగ్ర నివేదికను అధికారులు సమర్పించాలి. దీన్ని ఫాలోఅప్ చేయాల్సిన అధికారులు అంటిముట్టనట్టు వ్యవహరించడంతో ఇంకా ఆలస్యం అవుతోంది.
వరంగల్ జిల్లా బాలరక్షా భవన్‌లో దుస్థితి
ఇప్పటికే రెండు దరఖాస్తులు రిజెక్ట్,
మరో అప్లికేషన్ క్యాన్సల్ రిక్వెస్ట్ అని స్టేటస్
దత్తత రీవ్యాలిడేషన్‌కు మరో రెండు
దరఖాస్తులు
నకిలీ సర్టిఫికెట్ల కేసును
‘కారా’కు నివేదిస్తేనే
తిరస్కరించినవి మళ్లీ సీనియార్టీలోకి..
ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌కు చెందిన సల్లూరి నర్సయ్య, ఆయన భార్య పైరి రుక్మ.. 2022 మార్చి మూడో తేదీన శిశువు దత్తత కోసం జిల్లా బాలరక్షా భవన్ అధికారులను సంప్రదించి కారాలో దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత 2025 ఏప్రిల్ 19వ తేదీన అప్లికేషన్ క్యాన్సల్ రెక్విస్ట్ అని కారా వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది.
నల్లబెల్లి మండలం రుద్రగూడెంకు చెందిన చెంచు మహిపాల్, సంధ్యారాణి దంపతులు.. 2022 సెప్టెంబర్ 13వ తేదీన కారా వెబ్‌సైట్‌లో పిల్లల కోసం దరఖాస్తు చేశారు. దాదాపు మూడేళ్లకుపైగా వారికి సీనియారిటీ ఉన్నా వారి దరఖాస్తు ఇటీవల రిజెక్ట్ కావడం గమనార్హం.
నర్సంపేటలోని శాంతినగర్ వాసి, ఒంటరి మహిళ అయిన నిమ్మనబోయిన అరుణ 2019 మార్చి ఆరో తేదీన దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు కూడా రిజెక్ట్ అయింది.
నెక్కొండ మండలం గొల్లపల్లికి చెందిన ముక్కల లస్మయ్య, చిన్న కేతమ్మ.. శిశువు దత్తత కోసం 2022 అక్టోబర్ 15వ తేదీన జిల్లా దత్తత అధికారిని సంప్రదించారు. అధికారి సూచనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే మూడేళ్లకు కాలపరిమితి ముగియడంతో రీవ్యాలిడేషన్ చేయాలని, పెండింగ్‌లో ఉన్నట్టుగా దరఖాస్తు స్టేటస్ కనిపిస్తోంది.
పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన గుండు సుధాకర్, సుమతి దంపతులు 2021 డిసెంబర్ 15న దరఖాస్తు చేసుకున్నారు. వారి కాలపరిమితి ముగియడంతో ఇంకా రీవ్యాలిడేషన్ ప్యాప్స్ స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్టుగా ఆన్‌లైన్‌లో కనబడుతోంది.


