న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందించి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు వివిధ శాఖలకు సంబంధించిన 10 ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 6 నుంచి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిశీలన అంశంపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామని వెల్లడించారు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ ఆద్వర్యంలో అవగాహన సదస్సులు ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు, ఏప్రిల్ 20 నుంచి 25 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరుపై సమీక్షించి, లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, రక్షణ, డ్రగ్స్‌పై అవగాహన సదస్సులు, మే 4 నుంచి 9 వరకు రైతు సదస్సులు, మే 11 నుంచి 16 వరకు పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రతపై కార్యక్రమాలు, మే 18 నుంచి 23 వరకు యువత–క్రీడాంశాలు, మే 25 నుంచి 30 వరకు మహిళా సాధికారత, రుణాల సద్వినియోగంపై కార్యక్రమాలు, జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణం అంశంపై కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామ, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో కార్యాచరణపై మంత్రుల సమీక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను రోజువారి ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. ప్రతిస్థాయిలో నోడల్ అధికారులను నియమించి రోజువారి పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీఓలు ఉమారాణి, సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద


