చదరంగంలో చిన్నారికి రేటింగ్
వరంగల్ స్పోర్ట్స్: కాజీపేట మండలం టేకులగూడేనికి చెందిన పెండ్రు ప్రదీప్, చరిత్ర దంపతుల కుమార్తె సాన్విక చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించింది. ఇటీవల తమిళనాడులోని ఏతేన్స్ ఆఫ్ ఈస్ట్ బీ లో 1800 రేటెడ్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొని 1,576 రేటింగ్‌ను సాధించినట్లు కోచ్ రాజు తెలిపారు. హనుమకొండ రామ్‌నగర్‌లోని చిల్డ్రన్స్ మాంటిసోరి స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్న సాన్విక, రుద్రమదేవి అకాడమీలో శిక్షణ పొందుతోంది. సాన్వికను వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య బాద్యులు పి.కన్నా, శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్ అభినందించారు.
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ప్లాస్టిక్ సర్జన్ విభాగంలో రెండు సూపర్‌స్పెషాలిటీ సీట్ల మంజూరు కోసం ఎన్‌ఎంసీ ఇన్‌స్పెక్టర్ నీరజ్‌ఖాన్ అగర్వాల్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. 1,500 పడకలతో కొనసాగుతున్న ఎంజీఎం ఆస్పత్రిలో నెఫ్రాలజీ విభాగంలో మాత్రమే రెండు సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్లు మంజూరయ్యాయి. వీటితో కార్డియాలజీ, సీటీవీసీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జన్ వంటి విభాగాల్లో సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్ల అనుమతి కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) విన్నవించింది. ఈక్రమంలో బుధవారం వారణాసికి చెందిన నీరజ్‌ఖాన్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లు, ప్లాస్టిక్ సర్జరీ వార్డుతో పాటు ఓపీ విభాగాలను సందర్శించారు. వైద్యుల వివరాలు సేకరించారు. కేఎంసీలో ప్రిన్సిపాల్‌తో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్, ప్లాస్టిక్ సర్జన్ వైద్యులు రంగనాథ్, విరాజ్ పాల్గొన్నారు.
హసన్‌పర్తి: సర్కార్ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి అప్పయ్య సూచించారు. హసన్‌పర్తి మండలం భీమారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు.
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేలా ఈనెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. వివిధ కంపెనీల్లో సుమారు 60కి పైగా ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 7న ఉదయం ములుగు రోడ్డులోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలోని ఉపాధి అధికారి కార్యాలయంలో విద్యార్హతల జిరాక్స్ ద్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 78933 94393లో సంప్రదించాలని కోరారు.
చదరంగంలో చిన్నారికి రేటింగ్
చదరంగంలో చిన్నారికి రేటింగ్


