ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నర్సంపేట/వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించాని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు నర్సంపేట, వర్ధన్నపేటలో శుక్రవారం నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతున్న తీరును గమనించిన కలెక్టర్.. అభ్యర్థులు, వారి ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని, నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీఓలు ఉమారాణి, సుమ, వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, ప్రత్యేకాధికారి రమేశ్ ఉన్నారు. అదేవిధంగా జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి డి.వీరారెడ్డి వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఖర్చు లెక్కలు సమర్పించాలి..
న్యూశాయంపేట: పురపాలక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నర్సంపేట, వర్ధన్నపేట, మున్సిపల్ ఎన్నికలపై కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రేట్ చార్ట్ ఖరారు చేశారని, ఒక్కో పార్టీ అభ్యర్థి లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఖర్చుకు లెక్కల రూపంలో నమోదు చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు.


