జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క | - | Sakshi
Sakshi News home page

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క

Jan 30 2026 7:30 AM | Updated on Jan 30 2026 7:30 AM

జయహో

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క

సమ్మక్క ఆగమనం ఇలా..

నేడు మొక్కులు..

● 7.13 గంటలకు మూడోసారి కాల్పులు

● 7.14 గంటలకు నాలుగోసారి కాల్పులు

● 7.33 గంటలకు ప్రధాన గేటు దాటి అమ్మవారు బయటకు రాక

● 7.52 గంటలకు ఎదురుకోళ్ల మండపం చేరిక

● 8.29 గంటలకు సమ్మక్క గుడి చేరిక

● 9.47 గంటలకు ప్రధాన ద్వారం వద్దకు రాక

● 9.58 గంటలకు గద్దైపె సమ్మక్క ప్రతిష్ఠాపన

వెన్నెల వెల్లివిరిసిన వేళ.. కుంకుమ భరిణె వెలిసింది. లక్షల నయనాల నిరీక్షణల నడుమ.. చిలకలగుట్ట చిందులు వేసింది. గాల్లో పేలిన తూటాల సాక్షిగా మనస్సు ఉప్పొంగింది. దారులన్నీ రంగులు రంగరించుకుంటుంటే.. ఇసుకేస్తే రాలనంత జనం జయజయధ్వానాలు పలికారు. డోలు వాయిద్యాలు.. బూరకొమ్ముల శబ్దాలు తల్లిని కీర్తించగా.. రోప్‌ పార్టీ వెంట సాహో.. సమ్మక్క నినాదాలు హోరెత్తాయి. అవనినేలే తల్లి ఆసీనురాలవ్వగా.. ధరణి పూల వనమై పులకించిపోయింది.

జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం అడుగుడుగునా భక్తుల నీరాజనాలు

గద్దెలపై కొలువైన నలుగురు దేవతలు నేడు మొక్కులు సమర్పించనున్న భక్తులు

మేడారం(ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం):

మేడారం మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కల్పవల్లి సమ్మక్క తల్లి వస్తుండగా జై సమ్మక్క అంటూ భక్తుల నినాదాలు హోరెత్తాయి.. గద్దెల వరకు నీరాజనాలు పలికారు. గుట్ట దిగి సమ్మక్క తల్లిని పూజారులు డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాలతో తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు.

గుట్టపై రహస్య పూజలు..

గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌ ఇంటి వద్ద పూజాసామగ్రి, పసుపు, కుంకుమ, కంకనాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలను తీసుకొని పూజారులు గుట్టపైకి వెళ్లారు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరో నలుగురు పూజారులు కలిసి సమ్మక్క కొలువై ఉన్న రహస్య స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి కొన్ని గంటల పాటు రహస్య పూజలు చేశారు. కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొని గుట్టదిగే మధ్యలో మరికొంతమంది పూజారులు కలిసి గుట్టదిగారు. అధికారికంగా తుపాకీతో ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌ గాల్లోకి నాలుగు సార్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. చిలకలగుట్ట దారిమధ్యలో ఉన్న ఎదురుకోళ్ల పూజా మందిరానికి అమ్మవారిని తీసుకెళ్లి పూజారులు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. అక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కలెక్టర్‌ దివాకర టీఎస్‌, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జాతర చైర్‌పర్సన్‌ ఇర్ప సుకన్య, అధికారులు కలిసి అమ్మవారిని గద్దె వరకు తీసుకొచ్చారు. చిలకలగుట్ట వద్ద మంత్రి సీతక్కతోపాటు పలువురు మంత్రులు, అధికారులు, ఆదివాసీలు నృత్యాలు చేశారు.

హరివిల్లు.. చిలకలగుట్ట దారి

సమ్మక్కకు స్వాగతం పలికేందుకు మహిళలు దారిలో రంగు రంగులముగ్గులు వేశారు. అమ్మవారికి యాటపోతులు, కోళ్లు, కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు. చెట్టు, పుట్ట, గుట్టలు, ఎత్తయిన భవనాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రాకను తిలకించారు.

మూడుసార్లు లైట్ల ఆర్పివేత..

గద్దైపె సమ్మక్కను ప్రతిష్ఠించిన సమయంలో మూడుసార్లు హైమాస్ట్‌ లైట్లను ఆర్పివేశారు. పూజారులు గద్దైపెన అమ్మవారిని ప్రతిష్ఠించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదేక్రమంలో ఫొటోలు, డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారు. సమ్మక్క రాకకు ముందు గద్దైపె ఉన్న బంగారం, కానుకలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని పూజారులు తెలిపారు.

నలుగురు వనదేవతలకు పూజలు..

సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించడంతో నలుగురు వనదేవతలు కొలువుదీరారు. ఈఓ వీరస్వామి, ఎండోమెంట్‌ అధికారులతో కలిసి ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు.

సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించిన

అనంతరం పూజలు చేస్తున్న పూజారులు, ఆదివాసీ యువత, అధికారులు

సాయంత్రం 5.30 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్ట మీదకు వెళ్లారు.

6.45 గంటలకు ములుగు ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్‌ కేకన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు.

రాత్రి 7.12 గంటలకు గేటు వద్ద కాల్పులు

పోటెత్తిన భక్తజనం

మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు ఎటుచూసినా జనం కిక్కిరిశారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చిన వారు తప్పిపోకుండా ఉండేందుకు కర్రలకు జెండాలు, బెలూన్స్‌, వాటర్‌ బాటిళ్లను గుర్తుగా పెట్టుకొని ముందుకు సాగారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఉహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులు సమర్పించిన బంగారంతో కళకళలాడింది.

సమ్మక్క రాకముందు ప్రత్యేక పూజలు..

చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లి గురువారం రాత్రి కొలువుదీరడానికి ముందు సమ్మక్క పూజారులు తల్లి గద్దైపె ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమ్మక్క గుడి నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, దూప వడ్డె దొబె నాగేశ్వర్‌రావు, జలకం వడ్డె మల్యెల సత్యంతోపాటు పూజారులు కలిసి సమ్మక్క వడెరాలు, పసుపు, కుంకుమలను తీసుకుని డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాల నడుమ గద్దైపెకి వె ళ్లి పూజలు చేశారు.

గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువుదీరడంతో నేడు (శుక్రవారం) భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శించుకుంటారు. తీరొక్క మొక్కులు చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పటికే కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేస్తారు.

సమ్మక్క గద్దైపె కంకవనం ప్రతిష్ఠ

మేడారంలోని జెండాగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కంకవనాన్ని తీసుకొచ్చి గురువారం ఉదయం పది గంటలకు గద్దైపె ప్రతిష్ఠించారు. మొదట జెండాగుట్టలో పూజారులు కంకవనానికి పూజలు నిర్వహించారు. కర్రలతో కంకవనాన్ని బందోబస్తు మధ్య గద్దె వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఆడపడుచులు ఎదురెళ్లి పూజారుల పాదాలకు నీళ్లు ఆరగించి హారతి పట్టారు. తల్లి వచ్చే దారిలో చిలకలగుట్ట వద్ద ఆనవాయితీగా కింద కూర్చొని పైకి లేచి నమస్కరించారు. గద్దె వద్దకు చేరుకున్న పూజారులు ముందుగా గద్దె పక్కనే ఉన్న రహస్య పూజా మందిరంలోకి పూజలు చేశారు. అనంతరం గద్దైపె ప్రతిష్ఠించారు. ఈ సమయంలో భక్తులను గద్దెలపైకి రాకుండా పోలీసులు అదుపు చేశారు. సారలమ్మ గద్దె వద్ద పూజలు నిర్వహించారు. ఈ వనమహోత్సవానికి మంత్రి సీతక్క హాజరై పూజారులతో కలిసి గద్దైపెకి వచ్చారు.

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క1
1/3

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క2
2/3

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క3
3/3

జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement