రెండేళ్లలో ‘మామునూరు’కు రెక్కలు
253 ఎకరాలను ఏఏఐకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కేంద్రం ముందుకెళ్తోంది. రూ.850 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో పూర్తిచేయనుంది. ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కూడా నిర్మించనుంది. త్వరలోనే ఈ నిర్మాణ పనుల టెండర్లపై దృష్టి సారించనుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద ఉన్న 696.14 ఎకరాలకు అదనంగా కావాల్సిన 253 ఎకరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గురువారం అధికారికంగా అప్పగించింది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ భూమికి సంబంధించి పత్రాలను కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో కూడిన బృందం అందించింది. దీంతో ఇక కేంద్ర ప్రభుత్వమే సాధ్యమైనంత తొందరగా నిర్మాణ పనులు చేయడం ద్వారా వరంగల్ అభివృద్ధి బాటలో పయనించే అవకాశముంది. ఈ మేరకు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి వ్యాఖ్యలతో ఏళ్లుగా ఆకాశంలో విహరించాలన్న వరంగల్ వాసుల కలనెరవేరే అవకాశముంది. ఇది అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్లు(123 ఫీట్ల)పొడవనున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.
రూ.850 కోట్ల వ్యయంతో
విమానాశ్రయ నిర్మాణం
త్వరలోనే ఆయా పనుల
టెండర్లపై కేంద్రం దృష్టి
ఉడాన్ కింద అందుబాటులోకి
రానున్న ఎయిర్‌పోర్ట్
నాలుగేళ్ల క్రితం ఎంపిక..
చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం ఉడాన్ పథకం కింద మామూనూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్‌లో ఎంపిక చేసింది. మామూనూరులో నిజాం కాలంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. ఇక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. దశాబ్దాలుగా వాటి వినియోగం లేకపోవడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్ స్ట్రిప్ కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్ వే విస్తరణ కోసం అదనంగా అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని 253 ఎకరాల భూసేకరణ చేశారు. ఈ 253 ఎకరాల్లో 30 ఎకరాల ప్రభుత్వ భూమి, 223 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములున్నాయి. ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.295 కోట్లు మంజూరు చేసింది. వ్యవసాయ భూమికి రూ.కోటి 20 లక్షలు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887 చెల్లించారు. మొత్తం 330 మంది భూనిర్వాసితుల ఖాతాల్లో డబ్బు జమచేశారు. అయితే కోర్టు వివాదాల్లో 15 ఎకరాలు ఉండగా, ఆ డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు.


