కోటను కాపాడితేనే భవిష్యత్!
ఓరుగల్లు చరిత్రను భావితరాలకు తెలియాలి
కాకతీయ కళా వైభవాన్ని సంరక్షించుకోవాలి
ఖిలావరంగల్ కోటను కొంతమంది ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారంటూ ఏఎస్‌ఐ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఓరుగల్లు కోట చరిత్ర కొనసాగాలంటూ ఈ అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వేల ఏళ్ల నాటి చరిత్ర భావితరాలకు అందించాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఓరుగల్లు కోట భవిష్యత్‌లో వరల్డ్ హెరిటేజ్‌లోకి తీసుకెళ్లే ప్రతిపాదనలు ఉండటంతో కాకతీయ కళా వైభవాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
– పాండు రంగారావు, ఇన్‌టాక్ కన్వీనర్
చరిత్రను బతికించాలి
కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలకు అనుమతించరు. కానీ ఖిలావరంగల్ కోటలో అడుగడుగునా ఆక్రమణలు ఉన్నట్టు ఇప్పటికే ఏఎస్‌ఐ అధికారులు అనేకసార్లు నోటీసులిచ్చారు. అయినా అక్రమ నిర్మాణాలు ఆగలేదు. అధికారులు మేల్కొని వేల ఏళ్ల క్రితం నాటి చరిత్రను బతికించాలి.
– మండల భూపాల్, రాష్ట్రీయ హిందూ పరిషత్ ప్రతినిధి
ఆక్రమణలు నియంత్రిస్తేనే భావితరాలకు చరిత్ర
మా టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) సంస్థ పురాతన ఆలయాలపై పరిశోధన చేస్తుంది. ఈ క్రమంలోనే ఓరుగల్లు కోట చరిత్రపై లోతుగా అధ్యయనం చేశాం. కాకతీయుల పాలనకు వేదికగా నిలిచిన ఈ మాన్యుమెంట్‌లను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ఇక్కడ ఆక్రమణలు పెరిగాయి. మట్టికోట చుట్టూ ఉన్న మట్టిని తరలించి కోటకు బీటలు పడేలా చేస్తున్నారు. వీటిని నియంత్రించడం ద్వారానే భవిష్యత్ తరాలకు కాకతీయ చరిత్రను అందించగలుగుతాం. – ఆరవింద్ ఆర్య, కార్యదర్శి, టార్చ్
●
సాక్షి, వరంగల్: చారిత్రక ఓరుగల్లు కోటాను కబ్జాల నుంచి కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చరిత్రకారులు, ఓరుగల్లు వాసులు అంటున్నారు. మట్టికోట, రాతికోట, స్మారక చిహ్నాల పరిసర ప్రాంతాల్లో పుట్ట గొడుగుల్లా పుట్టుకు వచ్చిన భవనాలు, వ్యాపార సముదాయాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి చారిత్రక సంపదను సంరక్షించాల్సిన అవసరముందని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటకు సంబంధించిన భూములు అర్కియాలాజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కు చెందినవైనా.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడంతో ఈ ఆక్రమణదారుల పాలిట వరమైంది. ఏఎస్‌ఐ నిర్మాణదారులకు నోటీసులిచ్చినా, చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కించడంతో వేల ఏళ్ల నాటి చరిత్ర కళ్ల ముందే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం.. పురావస్తు కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు నిర్మాణాలకు అనుమతించరు. 100 నుంచి 200 మీటర్ల దూరంలో గతంలో ఉన్న ఇళ్లకు మరమ్మతు చేసుకోవాలన్నా, భవనాలు కట్టాలన్నా పురావస్తు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓపీ) తీసుకోవాలి. ఈ నిబంధనలు ఆక్రమణదారులు కాలరాస్తున్నారు. అర్కియాలాజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఇంటి నంబర్ ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్ మంజూరు నిషిద్ధమైనా ప్రభుత్వ శాఖలు ఇవ్వడంతో దేశమే కాదు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కాకతీయ కట్టడాలు ఇప్పుడూ ప్రమాదంలో పడ్డాయని, ఇప్పటికై నా మేల్కొని ఓరుగల్లు కోటను కబ్జాకోరుల నుంచి కాపాడాలని చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఆక్రమణలు లేకుండా చూడాల్సిందే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి
చారిత్రక సంరక్షణపై చరిత్రకారుల గళం
కోటను కాపాడితేనే భవిష్యత్!
కోటను కాపాడితేనే భవిష్యత్!
కోటను కాపాడితేనే భవిష్యత్!


