వివాదంలో వ్యవసాయ కళాశాల
సాక్షి, వరంగల్: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశ్నపత్రాల లీకేజీ ‘వరంగల్’ కేంద్రంగానే జరిగిందని నిర్ధారణ కావడంతో ఈ కళాశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడి కాలేజీకి చెందిన ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయడంతో పాటు 8 మంది ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు లీకేజీ పత్రాలు అందినట్లు గుర్తించి వారి ప్రవేశాలను రద్దు చేయడం సంచలనంగా మారింది. బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల్లో పాథాలజీ సబ్జెక్ట్ పేపర్‌లో 90 శాతానికిపైగా మార్కులు రావడంతో అనుమానం వచ్చిన వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య జగిత్యాల వర్సిటీలో విద్యార్థులపై ప్రశ్నలు వర్షం కురిపించడంతో తొలుత అశ్వరావుపేట అని, ఆ తర్వాత వరంగల్ నుంచి లీకేజీ పేపర్ వచ్చినట్లుగా తేలింది. ఈమేరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ బుధ, గురువారం రెండురోజుల పాటు ఈ వ్యవసాయ కాలేజీలోనే ఉండి విచారణ చేపట్టారు. 23 మంది సిబ్బంది ఉంటే అందరితో మాట్లాడి ముఖ్యంగా ‘ఆఫీస్ ఆఫ్ అకడమిక్ మ్యాటర్స్’ అధి కారులను విచారించారు. అయితే వ్యవసాయ కళా శాలలో పనిచేసే తన తండ్రి గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానంలో ఉద్యోగం పొంది ప్రస్తు తం జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కార్తీక్ నుంచే ఈ ప్రశ్నపత్రం లీకై నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అదేవిధంగా అతడి బ్యాంక్ లావాదేవీలు పరిశీలించగా రూ.వేల నుంచి రూ.లక్షలు ఉండడంతో అనుమానం వచ్చి అడగ్గా సమాధానం దాటవేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. రూ.వేలల్లో జీతం తీసుకునే వ్యక్తికి రూ.లక్షల్లో విలువ చేసే ఖరీదైన కారు ఎక్కడి నుంచి వచ్చింద ని కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఏఓ రమేశ్ వచ్చి ఆరు నెలలు తిరగకముందే విధుల్లో నిర్లక్ష్యంతో సస్పెన్షన్‌కు గురైనట్లుగా వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిటీ ఇచ్చే ని వేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.
ప్రశ్నపత్రాల లీకేజీలో ఇక్కడి సిబ్బంది పాత్ర ఉన్నట్లు నిర్ధారణ
ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సస్పెన్షన్
8 మంది ఇన్‌సర్వీస్ విద్యార్థుల
ప్రవేశాలు రద్దు
ఉలిక్కిపడిన కాలేజీ సిబ్బంది,
విద్యార్థులు


