వేగిరం చేయాల్సిందే..
సాక్షి, వరంగల్: హైదరాబాద్‌లో జరిగే అభివృద్ధి వరంగల్ నగరంలోనూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నెలక్రితం నర్సంపేట పర్యటనలో హామీ ఇచ్చిన మేరకు అధికారులు వేగిరం చేస్తే వరంగల్‌కు శ్రీకొత్తశ్రీ వెలుగులు రానున్నాయి. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను ఈ ఏడాది మార్చి 31 లోపు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులు వరంగల్ నగరానికి కీలకం కావడంతో ఇవీ పూర్తయితే వరంగల్ రూపురేఖలే మారే అవకాశముంది. ఏళ్లుగా కలలు కంటున్న మామునూరు విమానాశ్రయం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించడంతో 253 ఎకరాల భూసేకరణ పూర్తి కావొచ్చింది. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌కు అనుగుణంగా ఈ విమానాశ్రయ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మార్చిలోగా ప్రారంభమయ్యే అవకాశముంది. నిర్మాణానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించడంతో నిర్మాణ పనులు వేగంగా సాగితే సాధ్యమైనంత తొందరగా వరంగల్‌లో విమానాలు ఎగిరే అవకాశం కనబడుతోంది. 40 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతోపాటు గ్రేటర్ వరంగల్ నగరానికి అత్యవసరమైన భూగర్భ డ్రెయినేజీకి రూ.4,170 కోట్ల నిధులతో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో వరంగల్ నగరం వరదల్లో మునిగిపోతుండడంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే వరంగల్ వాసులకు ఎంతో ఊరట కలుగుతుంది.
తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
వరంగల్ చుట్టూ 69 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే రాంపూర్ నుంచి ఆరెపల్లి వరకు 29 కిలోమీటర్ల జాతీయరహదారి నిర్మించి ఉంది. మిగిలిన 40 కిలోమీటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.669 కోట్ల నిధులు కేటాయించింది. జాతీయ రహదారుల శాఖ కూడా ఓఆర్‌ఆర్ నుంచి ఖమ్మం ప్రధాన రహదారిని నిర్మించే ప్రతిపాదనల్లో ఉంది. ఈ ఏడాది మార్చిలో ఔటర్ రింగ్ రోడ్డు పట్టాలెక్కే అవకాశముంది. అలాగే రూ.107 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల్లో వేగిరం పెరిగితే వరంగల్ నగరానికి ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. విజయవాడ నుంచి నాగపూర్‌కి నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నాలుగు లేన్ల రహదారి ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, తిమ్మాపూర్, ఏనుగల్లు, పర్వతగిరి, నెక్కొండలో జరుగుతున్న నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా అధికారులు చూడాలి. ఇలా 2026లో కొత్త రహదారులు అందుబాటులోకి వస్తుండడంతో ప్రయాణం మరింత సులభతరం కానుంది. అలాగే గీసుకొండ, సంగెం మండలాల్లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును కేంద్రం పీఎం మిత్ర పథకంలో చేర్చడంతో అక్కడి నుంచి రూ.200 కోట్లు వస్తే మౌలికవసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన సమయంలోనే ఈ పనులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశముంది.
ప్రత్యేక దృష్టి సారించాల్సిందే..
వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్‌లో ప్రారంభమయ్యాయి. 2024లోనే ఇదీ అందుబాటులోకి వస్తుందనుకున్నా డిజైన్ల మార్పు, అంచనాల పెంపుతో ఆలస్యమైంది. గతేడాది డిసెంబర్ ఆఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా నింపాది పనులతో ఈ ఏడాది మార్చి వరకు పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. ఎంజీఎంలోని 1,500 పడకల ఆస్పత్రి ఇక్కడకు తరలడం ద్వారా, అక్కడ మరో 500 పడకలు (కార్డియాలజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటు వల్ల రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాధ్యమైనంత తొందరగా అధికారులు దీనిపై దృష్టి సారించి అందుబాటులోకి తీసుకువస్తే వేలాది మందికి కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ వైద్య సేవలు అందే అవకాశముంది.
కొలిక్కివచ్చిన ఎయిర్‌పోర్ట్ భూసేకరణ ప్రక్రియ
ఓరుగల్లులో విమానాలు ఎగిరే అవకాశం
భూగర్భ డ్రెయినేజీ పనులకు ఇప్పటికే డీపీఆర్
మిగిలిన ఔటర్ రింగ్ రోడ్డు పనులు
పట్టాలెక్కే ఛాన్స్
మార్చిలో భూమిపూజ చేస్తానని సీఎం హామీ
వేగిరం చేయాల్సిందే..
వేగిరం చేయాల్సిందే..
వేగిరం చేయాల్సిందే..


