మామిడిలో కానరాని పూత
గీసుకొండ: మామిడి తోటలు సాగుచేస్తున్న రైతులకు ప్రస్తుత సీజన్ నిరాశాజనకమనే చెప్పవచ్చు. డిసెంబర్ నెల చివరి నాటికి తోటలు విరగపూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అలాంటిదేం కనిపించడం లేదని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితికి ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం, చలి అధికంగా ఉండడమే కారణం అంటున్నారు ఉద్యానశాఖ అధికారులు. ఈ ఏడాది అక్టోబర్ నెల చివరి వరకు వర్షాలు కురవడంతో మామిడి తోటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెబుతున్నారు. పలు మామిడి చెట్లకు పూతకు బదులు చిగుర్లు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మామిడి కాయల దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. సహజంగా మామిడి తోటల్లో నవంబర్ నుంచి మొదటి దశ, డిసెంబర్‌లో రెండో దశ పూత వస్తుంది. ఈసారి అధికవర్షాలతోనే పూత రావడం ఆలస్యమైందని తెలుస్తోంది. పూత త్వరగా వచ్చి నిలిస్తే మామిడి కాయలు ఏపుగా ఎదిగి దిగుబడి అధికంగా వస్తుంది. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సమయంలో కాత చేతికి రాదు. జిల్లా నుంచి ముందుగా వచ్చే మామిడి కాయలు, పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పూత, కాత ఆలస్యంగా వస్తే రైతులకు లాభాలకు బదులు నష్టాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా వచ్చే దిగుబడి సమయానికి కాకుండా నెల ఆలస్యంగా వస్తే వర్షాలు పడి కాయ ల అమ్మకంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని రైతులు అంటున్నారు. అయితే, జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి, ఫిబ్రవరిలో పూత, పిందె దశ వస్తుందని,, మామిడి రైతులు దిగులుపడొద్దని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో 1,622 మంది మామిడి రైతులు
జిల్లాలో సుమారు 1,622 మంది రైతులు 5,769 ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ఎ క్కువగా పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేటలో, ఓ మోస్తరుగా చెన్నారావుపేట, గీసుకొండ, నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, ఖిలా వరంగల్, సంగెం మండలాల్లో సాగు చేస్తున్నారు.
తోటలకు నీరు పెట్టొద్దు..
ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితిలో మామిడి తోటలకు పూత కొంత ఆలస్యంగా వస్తుంది. కొద్ది పాటి పూత వస్తే రైతులు దిగులు చెందొద్దు. మరో నెలలో పూత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో తోటలకు నీరు పెట్టడం, దున్నడం చేయవద్దు. భూ మి బెట్టుగా ఉంటేనే పూత వచ్చే అవకాశం ఉంటుంది. 50 నుంచి 60 శాతం వచ్చిన పూత విచ్చుకుని, పిందె దశలో ఉన్నప్పుడు నీరు పెట్టాలి. పూత రావడానికి 130045 మల్టీకే/పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. –డాక్టర్ ఎం.తిరుపతి,
వరంగల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి
10 శాతంలోపే పూతపూసిన తోటలు
అధిక వర్షాలు,
తీవ్ర చలి ప్రభావమే కారణం
ఆలస్యంగా వస్తుందంటున్న
ఉద్యానశాఖ అధికారులు
జిల్లాలో 5,761 ఎకరాల్లో
సాగు చేస్తున్న రైతులు
మామిడిలో కానరాని పూత


