సంతోషాలతో వేడుకలు నిర్వహించుకుందాం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.


