అగ్రంపహాడ్ జాతర పనులు వేగిరం చేయాలి
ఆత్మకూరు: అగ్రంపహాడ్ జాతర పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో బుధవారం జాతర పనులపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కలెక్టర్ స్నేహశబరీష్‌తో కలిసి సమీక్షించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్ జాతరలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతరలో భక్తుల సౌకర్యార్థం తాగునీరు, స్నానాలకు సౌకర్యం కల్పించాలన్నారు. పంచాయతీ రాజ్ అధికారులు జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ఎక్సైజ్ అధికారులు జాతర పరిసరాల్లో ఎక్కడా గుడుంబా విక్రయాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు జాతరలో రోడ్ల వెంట లైటింగ్ ఉండేలా చూడాలని 24గంటలు విద్యుత్ సౌకర్యం ఉండాలన్నారు. అలాగే భక్తులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
సమన్వయంతో విజయవంతం చేయాలి
అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. జాతరలో అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య అంచనా వేసి దానికి తగినట్లుగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఆర్డీఓ నారాయణ, ఎండోమెంట్ ఏసీ సునీత, ఏసీపీ సతీశ్‌బాబు, తహసీల్దార్ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ నాగేశ్వర్‌రావు, పూజారులు సాంబశివరావు, సారంగపాణి, వెంకన్న, సర్పంచ్‌లు మహేందర్, సాంబయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమలాపురం రమేశ్, కాంగ్రెస్ నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, బోరిగం స్వామి తదితరులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి,
కలెక్టర్ స్నేహ శబరీష్
అగ్రంపహాడ్ జాతర పనులు వేగిరం చేయాలి


