సర్కిల్‌.. క్రిటికల్‌! | - | Sakshi
Sakshi News home page

సర్కిల్‌.. క్రిటికల్‌!

Dec 26 2025 8:04 AM | Updated on Dec 26 2025 9:52 AM

సర్కిల్‌.. క్రిటికల్‌!

సర్కిల్‌.. క్రిటికల్‌!

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌లోని పలు డివిజన్ల ప్రజలు సేవల కోసం వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కావడం లేదు. అందుబాటులో లేని సర్కిల్‌ కార్యాలయాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. సుపరిపాలన కోసం గత ప్రభుత్వం 2017 అక్టోబర్‌ 13న 267 జీఓ విడుదల చేసింది. కాశిబుగ్గ, కాజీపేట రెండుగా ఉన్న సర్కిల్‌ కార్యాలయాలను విభజించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. 8 ఏళ్లు గడిచినా అడుగు ముందుకుపడకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

దూరంలో సర్కిల్‌ కార్యాలయాలు..

జనన, మరణ, నూతన భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రాలు, కొత్త ఇంటి నంబర్లు, ఆస్తుల విభజన, పేరు మార్పిడి, నల్లా కనెక్షన్లు, ట్రేడ్‌ లైసెన్స్‌, మార్టిగేజ్‌ రిలీజ్‌, ఇతర అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే బల్దియా సర్కిల్‌ కార్యాలయాలను ప్రజలు ఆశ్రయించాల్సిందే. కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్‌ కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. 2013 మార్చి 19న 42 విలీన గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 110 కిలోమీటర్లు ఉన్న నగరం 407.8 కిలోమీటర్లకు చేరింది. జనాభా 9 లక్షలకు చేరడంతో 53 డివిజన్లు 58కి చేరాయి. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2020–21 సంవత్సరంలో 58 డివిజన్లను డీలిమిటేషన్‌లో 66కు పెంచారు. ప్రస్తుతం నగర జనాభా 13 లక్షలకు చేరింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న 66 డివిజన్లను 88 డివిజన్లుగా డీలిమిటేషన్‌ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

8 ఏళ్లుగా కాగితాలకే సర్కిల్‌ కార్యాలయాలు

వ్యయప్రయాసాలకు గురవుతున్న డివిజన్ల ప్రజలు

పట్టించుకోని గ్రేటర్‌ పాలకవర్గం, ఉన్నతాధికారులు

అధికారులు, సిబ్బంది కొరతే కారణం..

గ్రేటర్‌లో ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 4 సర్కిళ్ల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కానీ, బల్దియా పాలకవర్గం, ఉన్నతధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సర్కిళ్లను ఏర్పాటు చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. దూరభారం భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియాకు అధికారులు, సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 2 సర్కిల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతంలోని రంగశాయిపేటలో లేదా ఉర్సు సీఆర్‌సీ సెంటర్‌, హనుమకొండ నయీంనగర్‌లో లేదా నక్కలగుట్టలో సర్కిల్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సేవలు మరింత అందుబాటులో ఉంటాయనే డిమాండ్‌ ఉంది. డివిజన్ల పునర్విభజనతోపాటు అదనపు సర్కిల్‌ కార్యాలయాల ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement