6 నెలలకే.. పగుళ్లు! | - | Sakshi
Sakshi News home page

6 నెలలకే.. పగుళ్లు!

Nov 25 2025 6:54 AM | Updated on Nov 25 2025 6:54 AM

6 నెల

6 నెలలకే.. పగుళ్లు!

వరంగల్‌ అర్బన్‌ : రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా ఉంది గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరు. పది కాలాల పాటు మన్నికగా ఉండాల్సిన అభివృద్ధి పనులు అవినీతిమూలంగా మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని పాత కౌన్సిల్‌ హాలు దెబ్బతినడంతోపాటు ఇరుకుగా మారింది. దీంతో ఆధునికీకరణ కోసం రూ.2కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకున్నాడు. రూ.కోటితో సివిల్‌ పనులు, రూ. కోటితో ఏసీలు, ఆడియో, ఎల్‌ఈడీ లైట్లు, 80 మంది కార్పొరేటర్లకు ఆధునిక సీట్ల పనులు చేపట్టారు. పాత కౌన్సిల్‌ హాల్‌ మేయర్‌, కమిషనర్‌, 66 మంది కార్పొరేటర్లకు సరిపడా సీట్లు ఉన్నాయి. కానీ, అన్ని విభాగాల వింగ్‌ అధికారులు, విలేకరులు కూర్చునేందుకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో గత ఐదేళ్లుగా మీడియాను అనుమతించడం లేదు. అంతేకాకుండా 2026లో డివిజన్ల పునర్విభజన ద్వారా 88 డివిజన్లుగా రూపాంతరం చెందనున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆరు నెలల కిందట పాత కౌన్సిల్‌ హాల్‌ పునరుద్ధరణకు రూ.2కోట్ల నిధులు కేటాయించారు. పాత కౌన్సిల్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

అవే రూ.2కోట్లు వెచ్చిస్తే నూతన

కౌన్సిల్‌ హాల్‌ నిర్మాణం జరిగేది..

బల్దియా ఇంజనీర్లకు ముందు చూపు కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల కోసం.. ప్రజాప్రతినిధులు చెప్పినట్లు తలూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. 50ఏళ్ల క్రితం హనుమకొండ కాంగ్రెస్‌ భవన్‌కు సమీపంలో బల్దియా కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయాన్ని ఎంజీఎం సమీపంలో భవనాన్ని నిర్మించి తరలించారు. భవనంతో పాటు కౌన్సిల్‌ హాల్‌ నిర్మించారు. ఇన్నేళ్ల కిందట నిర్మించిన పాత బిల్డింగ్‌, కౌన్సిల్‌ హాల్‌ను పూర్తిగా నేలమట్టం చేయాలి. ఆ స్థలంలో కొత్త భవనంతోపాటు కౌన్సిల్‌ హాల్‌ను నిర్మించాలి. కానీ, పాలకవర్గ పెద్దలు, ఇంజనీర్లు కేవలం పర్సంటేజీల కోసం మరమ్మతుల నాటకమాడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్‌ హాల్‌ పునరుద్ధరణ పనులు చేసిన ఆరు నెలల కాలంలో పగుళ్లు పడుతుండంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రూ.2కోట్ల నిధులతో కొత్త కౌన్సిల్‌ హాల్‌ నిర్మాణం పూర్తవుతుందని ఇంజనీర్లే చెబుతున్నారు. పాత భవనం స్లాబ్‌కు మరమ్మతులు చేస్తుండగానే మరోవైపు స్లాబ్‌ పెచ్చులు ఉడిపోతున్నాయి. దీంతో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయానికి వచ్చే పౌరులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లను తాళలేక పాత కౌన్సిల్‌ హాల్‌తోపాటు పాత బిల్డింగ్‌ రూ. 30లక్షలతో పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని, తామేమీ చేయలేమని ఇంజనీర్లు సమాధానం ఇస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. నిర్మాణ పనులపై క్వాలిటీ కంట్రోల్‌ కూడా చూసీచూడనట్లుగా నివేదిక సమర్పించడంతో బిల్లులు చెల్లింపులు చకచకా చెల్లింపులు చేసి, ఎవరికి వారు ప్రజాధనాన్ని వాటాలుగా పంచుకున్నారని పగళ్లను చూస్తే అర్థమవుతోంది. ఈ పనులపై లోతుగా విచారణ జరిపాలని, మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తాయని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

రూ.2కోట్ల నిధులతో

కొత్త భవనం కడితే పోలా!

ప్రజాప్రతినిధులు చెప్పిందే

వేదమంటున్నా ఇంజనీర్లు

పాత కౌన్సిల్‌, బిల్డింగ్‌ ఆధునికీకరణ పనుల్లో స్వాహాపర్వం

విచారణ చేస్తే

వెలుగుచూడనున్న అక్రమాలు

‘గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజావసరాలకు తగ్గట్టుగా భవనాలు, సిమెంట్‌రోడ్లు, సైడ్‌ కాలువలు, తాగునీటి సరఫరా పైప్‌లైన్ల పనులను నాణ్యతతో నిర్మిస్తున్నాం. నాసిరకంగా చేస్తే మాకు చెప్పండి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం.

– అభివృద్ధి పనుల ప్రారంభంలో

పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు

పదే పదే చెప్పే మాటలు.

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పగళ్లు.. బల్దియా కౌన్సిల్‌ హాల్‌, పాత భవనం పునరుద్ధరణ పనుల తీరువి. పాత భవనాల ఆధునికీకరణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు లోపించాయనడానికి ఉదాహరణలు. కౌన్సిల్‌హాల్‌ ఆధునికీకరణ పనులు చేసిన 6 నెలల్లోనే ఇలా నెర్రలు పడ్డాయి. మరోవైపు బల్దియా పాత బిల్డింగ్‌లకు మరమ్మతులు చేస్తుండగానే స్లాబ్‌ పెచ్చులు ఊడిపోతున్నాయి.

6 నెలలకే.. పగుళ్లు!1
1/1

6 నెలలకే.. పగుళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement