సుబ్రహ్మణ్య షష్ఠి జాతరకు వేళాయె
పరకాల: సుబ్రహ్మణ్య షష్ఠి జాతర ఉత్సవాలకు పరకాలలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు కోమాళ్లపల్లి నాగభూషణం శర్మ గృహం నుంచి బుధవారం బయల్దేరనున్న బోనం ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగనుంది. వందల ఏళ్ల నుంచి ఏటా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున బోనం, స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి పాంచాహ్నిక దీక్షతో స్వామివారి జాతర కల్యాణోత్సవాలు వైభోవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఏటా షష్ఠి జాతరకు వందలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.
షష్ఠిజాతర ఉత్సవాలు
షష్ఠి జాతర ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు పూర్తి చేశారు. నేడు(మంగళవారం) ఆనతి కట్టుట, అష్టదిగ్బంధన పూజా కార్యక్రమాల తర్వాత బుధవారం వంశానుగత అర్చకుడు కోమాళ్లపల్లి నాగభూషణం శర్మ నివాసం నుంచి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి షష్ఠి బోనం గ్రామ ప్రదక్షిణగా బయల్దేరుతుంది. బండ్లు తిరుగట, 27(గురువారం)న స్వామి వారి కల్యాణోత్సవం, 28వ తేదీన నిత్యాహ్నికం పూజలు, చందనోత్సవం వంటి విశేష పూజలు, 29వ తేదీన శనివారం నిత్యాహ్నికం, నాకబలి, తాంబూ లోత్సవం, 30న ఆదివారం స్వామి వారి మృగయాత్ర, డిసెంబర్ 1 సోమవారం అన్న పూజోత్సవం, త్రిశూల స్నానం, ధ్వజావరోహణం, నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, ఆలయ ప్రధానార్చకుడు కోమాళ్లపల్లి నాగభూషణం శర్మ తెలిపారు. బోనం ఊరేగింపు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కోర్కెలు తీర్చే స్వామి కుంకుమేశ్వరుడు
వంశానుగత అర్చకులుగా స్వామి వారికి సేవలందించడం మా అదృష్టం. షష్టి పూజలో పాల్గొన్న భక్తుల కోర్కెలు తీరుస్తుండడంతో జాతరకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
– కోమాళ్లపల్లి నాగభూషణం శర్మ,
ఆలయ ప్రధానార్చకుడు
రేపు ప్రధానార్చకుడి గృహం నుంచి బయల్దేరనున్న బోనం.. జాతర షురూ
తరలిరానున్న వేలాది మంది భక్తులు
సుబ్రహ్మణ్య షష్ఠి జాతరకు వేళాయె
సుబ్రహ్మణ్య షష్ఠి జాతరకు వేళాయె


