
భారీ వర్షం.. అప్రమత్తం
● జిల్లాలో కుండపోత
● ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
● కమలాపూర్ మండలంలో 4.26
సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
కమలాపూర్/పరకాల: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. దారులన్నీ జలమయమయ్యాయి. చెరువులు మత్తళ్లు దుంకాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు.
కమలాపూర్ మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో కాలనీలు జలమయమయ్యాయి. కమలాపూర్‌లోని బస్టాండ్ ప్రాంతంలో హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరి వాగును తలపించింది. వరద, వర్షపు నీరు వెళ్లేందుకు అనువైన డ్రెయినేజీలు లేక ఆ నీరంతా ఇళ్లు, వ్యాపార దుకాణాల్లోకి చేరింది. ఇళ్లల్లోకి చేరిన వరద నీటిని స్థానికులు బయటకు ఎత్తి పోశారు. కొన్నేళ్లుగా భారీ వర్షం కురిసిన ప్రతీసారి వర్షపు, వరద నీరంతా ఇళ్లల్లోకి చేరి బస్టాండ్ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతుండగా.. వరద నీరు రాకుండా కొందరు డ్రెయినేజీలు మూసివేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా 4.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పరకాలలో..
ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరకాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఎస్సీ కాలనీ, మల్లారెడ్డి పల్లె, మమత నగర్, శ్రీనివాసకాలనీ, రాంనగర్ కాలనీల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. వెంటనే మున్సిపల్ ఉద్యోగులు అప్రమత్తమై జేసీబీ ద్వారా కాల్వల్లో వరద నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ సుష్మ పలు కాలనీల్లో పర్యటించారు. చాలా మంది శిథిలమైన ఇళ్లను వదిలిపెట్టకపోవడంపై ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుంటే వాటిలోనే నివాసం ఉంటామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. రోజుల తరబడి నానితే గోడలు కూలిపోతాయని, తక్షణవే ఆయా ఇళ్లను వదిలిపెట్టి బంధువులు, మిత్రుల నివాసాలకు వెళ్లాలని సూచించారు.
చలివాగు ప్రాజెక్టు పరిశీలన..
శాయంపేట : జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టును నీటిపారుదల ములుగు చీఫ్ ఇంజనీర్ కుమారస్వామి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టులోని నీటి మట్టాన్ని అంచనా వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎగువన కురిసిన వర్షాలతో చలివాగు ప్రాజెక్టు నిండుకుండలా ప్రవహిస్తోందని, సమీప గ్రామస్తులు ప్రాజెక్టులో దిగవద్దని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమృత్ ఉన్నారు.
ఆకాశానికి దూదిపూలు పూసినట్లుగా మేఘాలు కమ్ముకొచ్చాయి. తరలిపోతున్న మేఘాలు చూపరులను కట్టిపడేశాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ జాతీయ రహదారిలో కనిపించిన ఈ సుమధుర దృశ్యాన్ని గురువారం ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ హనుమకొండ

భారీ వర్షం.. అప్రమత్తం

భారీ వర్షం.. అప్రమత్తం

భారీ వర్షం.. అప్రమత్తం

భారీ వర్షం.. అప్రమత్తం

భారీ వర్షం.. అప్రమత్తం

భారీ వర్షం.. అప్రమత్తం