
ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎంఈఓలు, పాఠశాలల హెచ్‌ఎంలు ప్రత్యేక దృష్టితో కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడం, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రోజువారీ ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరుశాతాన్ని పెంచాలన్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల గైర్హాజరుకు కారణాలు తెలియజేయాలన్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎఫ్‌ఆర్‌ఎస్ సరైన రీతిలో నమోదు చేయాలన్నారు. తరగతి గదిలో ప్రతీ విద్యార్థిని పరిశీలించి అభ్యసన సామర్థ్యాలను గురించి ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ వాసంతి తదితరులు పాల్గొన్నారు.
బోధనలో ప్రమాణాలు పెంచాలి..
న్యూశాయంపేట: విద్యాబోధనలో ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని ఎంఈఓలను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీలో భాగంగా బేస్‌లైన్ రిజల్ట్స్ ను తెలంగాణ స్కుల్ యాప్‌లో ఆన్‌లైన్ చేయాల న్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, సుజన్‌తేజ పాల్గొన్నారు.